Ranya Rao: కన్నడ నటి బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక వివరాలు వెలుగులోకి

Actor Arrested In Gold Smuggling Case Made 27 Dubai Trips In A Year
  • గతేడాది ఏకంగా 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిన రన్యా రావు
  • కిలోల కొద్దీ బంగారు బిస్కెట్లు రహస్యంగా తీసుకు వచ్చిందన్న అధికారులు
  • కిలో బంగారం తీసుకొస్తే రూ.లక్ష చొప్పున కమిషన్
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యా రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల విచారణలో రన్యా రావు గతేడాది 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిందని తేలింది. దుబాయ్ వెళ్లిన ప్రతిసారీ తిరిగి వస్తూ కిలోల కొద్దీ బంగారం బిస్కెట్లను రహస్యంగా దాచి తెచ్చిందని బయటపడింది. కిలో బంగారానికి రూ. లక్ష చొప్పున కమీషన్ అందేదని నటి వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ఓ కానిస్టేబుల్ సాయంతో ప్రత్యేక మార్గంలో బయటపడేదని వివరించారు. రన్యా రావు తరచుగా దుబాయ్ పర్యటనకు వెళ్లడం, వెళ్లిన ప్రతిసారీ ఒకే తరహా దుస్తులు ధరించడంపై అధికారులకు సందేహం వచ్చింది. దీంతో కిందటి సోమవారం దుబాయ్ విమానం దిగిన నటిని నిశితంగా సోదా చేయగా దుస్తుల్లో అక్రమంగా దాచిన బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. దీంతో నటిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెకు సహకరించిన కానిస్టేబుల్ ను కూడా అరెస్టు చేశారు.

స్మగ్లింగ్ కోసం స్పెషల్ గా డ్రెస్ డిజైన్
దుబాయ్ వెళ్లి వచ్చిన ప్రతిసారీ రన్యా రావు ఒకేరకమైన దుస్తులు ధరించేది. బంగారం స్మగ్లింగ్ చేయడానికి అనువుగా ప్రత్యేకంగా తయారు చేసిన జాకెట్స్, వెస్ట్ బెల్ట్స్‌ను ఉపయోగించేది. ఈ జాకెట్స్, బెల్ట్ ను నిశితంగా పరిశీలించగా లోపల రహస్యంగా దాచిన బంగారం బిస్కెట్లు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. తండ్రి పోలీస్ అధికారి కావడంతో ఆయన పరపతి తమకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఓ స్మగ్లర్ రన్యా రావును ఈ దందాలోకి దించాడని చెప్పారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత హస్తం కూడా ఉందని తెలిపారు. రన్యా రావు వెనకున్న కింగ్ పిన్, రాజకీయ నేత ఎవరనేది త్వరలో బయటకు రానుందని వివరించారు. బెంగళూరు విమానాశ్రయంలో కానిస్టేబుల్ తో పాటు మరికొందరు అధికారులు కూడా ఆమెకు సహకరించారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. 

ఆ గొడవతో రన్యా రావుపై నిఘా
ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న సమయంలో విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారి ఒకరితో రన్యా రావుకు గొడవ జరిగింది. తన సమీప బంధువు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సదరు అధికారిని అవమానించింది. దీంతో రన్యా రావు రాకపోకలపై సదరు అధికారి ఆరా తీశాడు. దుబాయ్ కి తరచూ వెళ్లి వస్తుండడంతో అక్కడ ఆమెకు వ్యాపారాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో రహస్యంగా విచారించాడు. అలాంటివేమీ లేవని తేలడంతో రన్యా రావు దుబాయ్ టూర్లపై సందేహం పెరిగిందని, ఈసారి దుబాయ్ ఫ్లైట్ దిగాక ఆమెను నిశితంగా సోదా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే గత ఆదివారం రాత్రి ఆమె విమానం దిగి వచ్చినప్పుడు సోదా చేయగా బంగారం బిస్కెట్లతో దొరికిపోయింది.
Ranya Rao
Kannada Actress
Dubai
Gold Smugling

More Telugu News