Nara Lokesh: ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నెం.1గా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh stated they will made govt schools as number one in five years
  • లెర్నింగ్ ఎక్సలెన్స్, జీవో 117 రద్దుపై ఎమ్మెల్యేలతో మంత్రి లోకేశ్ సమావేశం
  • చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని వెల్లడి
  • గత పాలకుల వైఫల్యాన్ని అసర్ నివేదిక తేటతెల్లం చేసిందని విమర్శలు
అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఉండవల్లి నివాసంలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ (లీప్), జీవో 117 రద్దు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై కూటమి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ 3 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. 

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... ప్రభుత్వ విద్యావ్యవస్థలో సమూలన ప్రక్షాళన చేసి, దేశంలోనే ఏపీ విద్యావ్యవస్థను నెం.1గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయానికి అనుగుణంగా తాను విద్యాశాఖ మంత్రిగా సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నెం.1గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 

విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, తద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించవచ్చని తెలిపారు. విద్యావ్యవస్థ కోట్లాదిమంది జీవితాలపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో జీవో 117 దుష్ఫలితాల గురించి అనేక మంది నాయకులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని చెప్పారు. వారంతా ప్రైవేటు స్కూళ్ల వైపు మళ్లారని తెలిపారు. గత పాలకుల వైఫల్యాన్ని అసర్ నివేదిక తేటతెల్లం చేసిందని చెప్పారు.

జాతీయ సగటు కంటే క్షీణత

ASER 2024 నివేదిక FLN నైపుణ్యాలలో క్షీణతను తెలియజేస్తుంది. 8వ తరగతి విద్యార్థుల్లో 55% మంది విద్యార్థులు కనీసం భాగహారం చేయలేకపోతున్నారు. 10వ తరగతిలో గ్రేడ్-3 విద్యార్థుల్లో 9 మందికి ప్రాథమిక సంఖ్యా నైపుణ్యాలు కూడా లేవు. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) 2021-22 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ విద్య శిక్షణ డొమైన్‌లో 60 పాయింట్లు సాధించింది. ఇది పెద్ద రాష్ట్రాల సగటు 66 కంటే తక్కువ. 

గత ప్రభుత్వ పొరపాటును సరిదిద్దేందుకే జీవో 117రద్దు

గత ప్రభుత్వం చేసిన పొరపాటును సరిదిద్దేందుకు జీవో 117ను రద్దు చేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. పాఠశాల విద్యలో ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కూల్ బ్యాగ్స్, గుడ్లు, చిక్కీలకు రూ.4,300 కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. ఎటువంటి ముందస్తు వ్యూహం లేకుండా సీబీసీబీఎస్ఈ, ఐబీల పేరుతో హడావిడి చేశారు. సీబీఎస్ఈ విధానం ప్రవేశపెట్టిన పాఠశాలల విద్యార్థులకు మాక్ టెస్ట్ నిర్వహిస్తే 90 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఐబీ నివేదిక పేరుతోనే రూ.5 కోట్లు దుర్వినియోగం చేశారు. 

ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు, స్కిల్ డెవలప్ మెంట్ ఎండి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Govt Schools
AP Model Education
G.O.117
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News