Revanth Reddy: రేవంత్ రెడ్డికి ఇష్టమని పూరీ, ఖీమా చేశాను: పాత ఇంటి ఓనర్ పార్వతమ్మ

Revanth Reddy met his rented house owner of past in Vanaparti
  • నేడు వనపర్తిలో రేవంత్ రెడ్డి పర్యటన
  • బాల్యంలో తాము అద్దెకున్న ఇంటి ఓనర్ ను కలిసిన వైనం
  • రేవంత్ రెడ్డి వనపర్తిలో తననొక సెలబ్రిటీ చేశాడన్న పార్వతమ్మ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా, తన బాల్యంలో వనపర్తిలో అద్దెకున్న ఇంటి ఓనర్ పార్వతమ్మను కలిశారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తన ఇంటికి రావడం పట్ల పార్వతమ్మ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా పలకరించింది. 

ఇన్నేళ్లు గడిచినా తనను గుర్తుపెట్టుకుని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తన ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉందని పార్వతమ్మ చెప్పారు. తమ ఇంట్లో అద్దెకుంటున్న సమయంలో రేవంత్ రెడ్డి తనను పార్వతక్కా అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవాడని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇవాళ కూడా అదే ప్రేమతో పార్వతక్కా అని దగ్గరికి తీసుకున్నాడని తెలిపారు. తమ ఇంట్లో అందరినీ పేరుపేరునా పలకరించాడని తెలిపారు. 

ఇక రేవంత్ రెడ్డికి ఇష్టమైన పూరీ, ఖీమా చేసి పెట్టానని, తిన్నాడని ఆమె వెల్లడించారు. వనపర్తి నుంచి వెళ్లిపోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ, ఇప్పటికీ నన్ను గుర్తుంచుకుని నా ఇంటికి రావడం రేవంత్ రెడ్డి గొప్ప మనసుకు నిదర్శనం అని పార్వతమ్మ వివరించారు. ఏదేమైనా వనపర్తిలో నా తమ్ముడు రేవంత్ నన్నొక సెలబ్రిటీని చేశాడు అంటూ ఆమె పొంగిపోయారు. 

ఇక, సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్వతమ్మ ఇంటికి వెళ్లడంపై సోషల్ మీడియాలో స్పందించారు. అక్షరాలతో రాయలేని ఆనందం... మాటలతో చెప్పలేని మధుర జ్ఞాపకం... అక్కతో ఈ తమ్ముడి అనుబంధం అంటూ కవితాత్మకంగా అభివర్ణించారు. అంతేకాదు, తన పర్యటన వీడియోను కూడా పంచుకున్నారు.
Revanth Reddy
Parvathamma
Vanaparti

More Telugu News