Kerala Mass Murder: కేరళలో వరుస హత్యలు.... విచారణలో దిగ్బ్రాంతిగొలిపే విషయాలు వెల్లడి

kerala mass murderer killed lover as she would be alone without him cops
  • అప్పు ఒత్తిడి తట్టుకోలేక తొలుత సామూహిక ఆత్మహత్యలకు ప్లాన్
  • ఆత్మహత్యకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో హత్యలకు ప్లాన్ చేసిన అఫాన్
  • తాను చనిపోతే ప్రియురాలు ఒంటరి అవుతుందని భావించి ఆమెను హత్య చేసిన వైనం
కేరళలో ప్రియురాలితో సహా నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దిగ్భ్రాంతికర విషయాలను తాజాగా పోలీసులు బయటపెట్టారు. రూ.65 లక్షల అప్పు తట్టుకోలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిందితుడు అఫాన్ భావించినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు అంగీకరించకపోవడంతో వారిని హత్య చేశాడని పేర్కొన్నారు. తాను చనిపోతే ప్రియురాలు ఒంటరి అవుతుందని భావించి ఆమెను కూడా చంపినట్లు నిందితుడు అఫాన్ విచారణలో వెల్లడించాడని చెప్పారు. 
 
పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెంజరమూడుకు చెందిన అఫాన్ (23) కుటుంబానికి సుమారు 65 లక్షల అప్పు ఉంది. దీనిని తీర్చాలంటూ 14 మంది ప్రైవేటు వ్యక్తులు అతనిపై ఒత్తిడి పెంచారు. అఫాన్ తండ్రి సౌదీలో ఉండేవాడు. స్థానికంగా అప్పుల వాళ్ల ఒత్తిడిని అఫాన్ తట్టుకోలేకపోయాడు. ఈ విషయంలో బాబాయ్, పిన్ని, నానమ్మ ఏ సహాయం చేయలేదు. దాంతో వారి మీద కోపం పెంచుకున్నాడు. అప్పుల వారి ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఆత్మహత్యే శరణ్యం అని నిర్ణయించుకున్న అఫాన్.. తల్లి, సోదరుడికి తెలియజేయగా, అందుకు తల్లి నిరాకరించింది. దీంతో హత్యలకు ప్లాన్ చేశాడు. తల్లి, సోదరుడిని హత్య చేసిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని అఫాన్ భావించాడు.
 
ఈ క్రమంలో తొలుత తల్లిపై దాడి చేశాడు. ఆ తర్వాత నానమ్మ దగ్గరకు వెళ్లి ఆమె బంగారు గొలుసు దొంగతనం చేసి, అనంతరం ఆమెను చంపేశాడు. అక్కడి నుంచి బాబాయి, పిన్ని ఇంటికి వెళ్లి వారిద్దరినీ హతమార్చాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి 13 ఏళ్ల తమ్ముడిని, ప్రేయసి ఫర్సానాను మట్టుబెట్టాడు. తాను చనిపోతే ప్రియురాలు ఒంటరి అయిపోతుందనే భావనతోనే ఆమెను చంపానని అఫాన్ పోలీసులకు తెలిపాడు. 

అయితే ఈ దాడిలో అఫాన్ తల్లి మరణించలేదు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ ఘటనపై ఆమె తన కొడుకుపై ఫిర్యాదు చేయకపోగా, తనపై కుమారుడు దాడి చేయలేదని, తానే మంచంపై నుంచి పడిపోయానని పోలీసులకు తెలిపింది. విషయం తెలుసుకున్న అఫాన్ తండ్రి రహీమ్ సౌదీ నుంచి తిరిగి వచ్చాడు. తన కుటుంబానికి ఈ స్థాయిలో అప్పులు ఉన్న విషయం తనకు తెలియదని పోలీసులకు తెలిపారు. మరోవైపు నిందితుడి మానసిక పరిస్థితిని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.     
Kerala Mass Murder
Crime News
Kerala News

More Telugu News