Maha Kumbh: కుంభమేళాలో సేవలందించిన పోలీసులకు స్పెషల్ బోనస్, స్పెషల్ లీవ్

UP Govt announces special bonus and special leave for police who worked tirelessly in Maha Kumbh
  • జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా
  • 45 రోజుల పాటు సాగిన ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం
  • కుంభమేళాలో సేవలు అందించిన 75 వేల మంది పోలీసులు
  • ఒక్కొక్కరికి రూ.10 వేల బోనస్, 7 రోజుల ప్రత్యేక సెలవులు ప్రకటించిన యోగి సర్కారు
  • ప్రతి పోలీసులకు మహా కుంభ్ సేవా పతకం అందించాలని నిర్ణయం
144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహా కుంభమేళా ఈ ఏడాది జయప్రదంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కార్యనిర్వహణశక్తికి సవాల్ గా నిలిచిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం... కొన్ని ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. 

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు అవిశ్రాంతంగా సాగిన కుంభమేళా క్రతువులో 62 కోట్ల మందికి పైగా భక్తులు పాలుపంచుకున్నారు. ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి తరించిపోయారు. 

ఇక, కుంభమేళా ఇంత దిగ్విజయంగా జరిగిందంటే అందులో పోలీసుల పాత్ర ఎనలేనిది. రేయింబవళ్లూ విధులు నిర్వహిస్తూ, నిత్యం తరలివచ్చే కోట్లాది మంది భక్తులను నియంత్రిస్తూ వారు అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీసుల సేవలకు తగిన గుర్తింపు ఇచ్చింది. 

మహా కుంభమేళాలో సేవలు అందించిన 75 వేల మంది పోలీసులకు రూ.10 వేల చొప్పున స్పెషల్ బోనస్ ప్రకటించింది. అంతేకాదు, వారికి 7 రోజుల స్పెషల్ లీవ్ కూడా మంజూరు చేసింది. వారికి మహా కుంభ్ సేవా పతకం కూడా అందించనుంది. 

యూపీ గవర్నమెంట్ ప్రకటనతో పోలీసులు ఆనందోత్సాహలకు లోనయ్యారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పోలీసులు ఓ కవితను కూడా చదివి వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Maha Kumbh
Police
Special Bonus
Uttar Pradesh

More Telugu News