రాష్ట్ర‌ బ‌డ్జెట్‌పై ఏపీ ఫైబ‌ర్‌నెట్ మాజీ ఛైర్మ‌న్ జీవీ రెడ్డి ప్ర‌శంస‌లు

AP Fibernet EX Chairman GV Reddy Praises State Budget 2025 26
  • త‌క్కువ రెవెన్యూ లోటుతో రూ. 3.22 ల‌క్ష‌ల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికబద్ధంగా రూపొందించార‌ని కితాబు
  • చంద్రబాబు నాయకత్వం పట్ల త‌న‌కు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటాయని వ్యాఖ్య‌
  • ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా చంద్ర‌బాబు సీఎం కావాల‌ని ఆకాంక్షించిన జీవీ రెడ్డి
ఏపీ ఫైబ‌ర్‌నెట్ మాజీ ఛైర్మ‌న్ జీవీ రెడ్డి శుక్ర‌వారం నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన వార్షిక బడ్జెట్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. అతి త‌క్కువ రెవెన్యూ లోటుతో రూ. 3.22 ల‌క్ష‌ల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించార‌ని కొనియాడారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆయ‌న పోస్టు పెట్టారు. 

"నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం వుంటాయి. 

తక్కువ కాలంలోనే టీడీపీలోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత" అని జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. 

కాగా, ఇటీవ‌ల జీవీ రెడ్డి వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఏపీ ఫైబ‌ర్‌నెట్ ఛైర్మ‌న్ ప‌ద‌వితో పాటు టీడీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం, పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ద‌వి నుంచి వైదొలిగిన విష‌యం తెలిసిందే.   
Go Back to Shorts
GV Reddy
AP Budget 2025-26
AP Fibernet
Andhra Pradesh

More Telugu News