Mahakumbh Mela: ముగిసిన మహా కుంభమేళా.. మళ్లీ ఎప్పుడు? ఎక్కడ?

Maha Kumbh 2025 Ends When And Where Is Next Kumbh Mela
  • 2027లో మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో కుంభమేళా
  • జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు నిర్వహణ
  • మహాకుంభమేళాకు 66 కోట్ల మంది భక్తుల హాజరు
ప్రపంచంలోనే అతిపెద్ద మత సమ్మేళనమైన మహాకుంభమేళా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో 45 రోజులపాటు జరిగిన ఈ వేడుక బుధవారం మహాశివరాత్రితో పరిసమాప్తమైంది. ఈసారి దాదాపు 66 కోట్ల మంది భక్తులు గంగ, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానమాచరించి సరికొత్త రికార్డు సృష్టించారు. అమెరికా జనాభా 34 కోట్ల మంది కాగా, అంతకు రెట్టింపు సంఖ్యలో కుంభమేళాకు భక్తులు తరలిరావడం విశేషం. 

 మళ్లీ ఎప్పుడు?
మహాకుంభమేళా ముగియడంతో తర్వాతి కుంభమేళా ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందని తెలుసుకోవాలన్న ఆసక్తి కలగడం సహజమే. వచ్చే కుంభమేళా 2027లో మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగుతుంది. నాసిక్‌కు 38 కిలోమీటర్ల దూరంలోని గోదావరి పుట్టినిల్లు అయిన త్రయంబకేశ్వరంలో జరుగుతుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శివాలయం ఇక్కడే ఉంది. 2027లో జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు కుంభమేళా జరుగుతుంది. నాసిక్ కుంభమేళాలో కటింగ్ ఎడ్జ్ సాంకేతికతను ఉయోగిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.  

వచ్చే మూడేళ్లలోనే మరో కుంభమేళా ఎందుకు? 
కుంభమేళాలు ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో ప్రతి మూడేళ్లకు ఒకసారి ఒక్కో నగరంలో జరుగుతాయి. నాలుగేళ్లకు ఒకసారి జరిగే దానిని కుంభమేళా అని, ఆరేళ్లకు ఒకసారి జరిగే దానిని అర్ధ కుంభమేళా అని పిలుస్తారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే దానిని పూర్ణ కుంభమేళా అని, 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే దానిని మహాకుంభమేళా అని వ్యవహరిస్తారు. 

ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు
ఈసారి మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు, భక్తులు హాజరయ్యారు. ఇక, మన ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ హాజరయ్యారు. అలాగే, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, కోల్డ్ ప్లే సింగ్ క్రిస్ మార్టన్ తదితరులు కుంభమేళాకు హాజరై పుణ్య స్నానాలు ఆచరించారు. అలాగే, 77 దేశాలకు చెందిన 118 మంది దౌత్యవేత్తలు కూడా కుంభమేళాకు హాజరయ్యారు. 
Mahakumbh Mela
Prayagraj
Uttar Pradesh
Nashik

More Telugu News