Tirumala: తిరుమలలో భక్తుల కోసం కూల్ పెయింట్!

ttd good news for devotees who come to tirumala in summer
  • వేసవిలో తిరుమల భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
  • ముందస్తు చర్యలపై ఉన్నతాధికారులతో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష
  • అధికారులకు కీలక ఆదేశాలు
వేసవి సెలవుల కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వేసవిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టీటీడీ ముందస్తు చర్యలు చేపడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు.

  వేసవి సెలవులలో యాత్రికుల రద్దీ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సదన్, తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే, యాత్రికులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు. తగినంత మేర లడ్డూల నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాత్రికుల కోసం అవసరమైన మేర ఓఆర్ఎస్ ప్యాకెట్ల నిల్వ ఉంచాలని వైద్య అధికారులకు సూచించారు. రానున్న వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, భాస్కర్, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, విజిలెన్స్ అధికారులు రామ్ కుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 
Tirumala
TTD
Devotees
Tirumala In Summer

More Telugu News