Sridhar Babu: కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే వారికి అండగా ఉంటాం: శ్రీధర్ బాబు

Sridhar Babu says will encourage SC and ST industrialists
  • ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామన్న మంత్రి
  • ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్న మంత్రి
  • ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించామన్న మంత్రి
స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులను అందిస్తామని, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఫిక్కిలో నిర్వహించిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇండస్ట్రియల్ పార్కులో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం ప్రత్యేకంగా కేటాయిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. చేవెళ్లలో దళితులకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం కచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించామని అన్నారు.

తాము అధికారంలోకి రాగానే పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన బకాయిలపై దృష్టి సారించామని తెలిపారు. ఎక్కువ మంది కార్మికులకు ఉపాధిని అందించే ఎంఎస్ఎంఈ ప్రత్యేక పాలసీని తీసుకువచ్చినట్లు చెప్పారు. రుణాలు పొందడంలో ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రయోజనం కలిగేలా ప్రత్యేక బృందాన్ని నియమించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Sridhar Babu
Telangana
BRS
Congress

More Telugu News