Zoho: హిందీ నేర్చుకోవాలంటూ 'జోహో' వ్యవస్థాపకుడి ట్వీట్... తీవ్రంగా స్పందించిన డీఎంకే

DMK slams Zoho founder for his Hindi language comments
  • తమిళనాడు ఇంజినీర్లు హిందీ నేర్చుకోవాలని శ్రీధర్ వెంబు ట్వీట్
  • దేశంలోని వివిధ నగరాల్లో ఉన్నవారితో సంభాషించాల్సి ఉంటుందన్న జోహో వ్యవస్థాపకుడు
  • మీ వ్యాపార అవసరాల కోసం మీ ఇంజినీర్లకు హిందీ నేర్పుకోండని డీఎంకే కౌంటర్
ముంబై, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో ఉన్న కస్టమర్లతో తమిళనాడుకు చెందిన ఇంజినీర్లు సంభాషించాల్సి ఉంటుందని, దురదృష్టవశాత్తూ తమిళనాడులో ఉన్న వారికి హిందీ తెలియకపోవడం బాధాకరమని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం, అన్నాడీఎంకే మధ్య హిందీ భాష విషయంలో మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఇలాంటి తరుణంలో తమిళనాడు ఇంజినీర్లు హిందీ నేర్చుకోవాలంటూ ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. జోహో దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని వివిధ నగరాల్లో ఉన్నవారితో సంభాషించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో తమిళనాడు ఇంజినీర్లు హిందీ నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. అందరూ రాజకీయాలను పక్కన పెట్టి హిందీ నేర్చుకోవాలని పోస్టులో పేర్కొన్నారు.

శ్రీధర్ వ్యాఖ్యలపై డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వ్యాపార అవసరాల కోసం కావాలనుకుంటే మీ ఇంజినీర్లకు హిందీ నేర్పించుకోవాలని సూచించారు. కానీ తమిళనాడుకు చెందిన విద్యార్థులపై హిందీని రుద్దే ప్రయత్నం చేయవద్దని వ్యాఖ్యానించారు. 

డీఎంకే రాజ్యసభ సభ్యుడు అబ్దుల్లా కూడా విమర్శలు గుప్పించారు. మీ వ్యాపారాన్ని సౌదీకి విస్తరించారని, కానీ అరబిక్ నేర్చుకోకుండానే ఎలా సాధ్యపడిందో చెప్పాలని నిలదీశారు.

ఈ వ్యాఖ్యలపై శ్రీధర్ స్పందించారు. హిందీ నేర్చుకుంటే పశ్చిమాసియా క్లయింట్లతో మాట్లాడేందుకూ వీలు కలుగుతుందని పేర్కొన్నారు. తమ వద్ద అరబిక్ ఇంజినీర్లు కూడా ఉన్నట్లు తెలిపారు.

హిందీ, అరబిక్ ఇంజినీర్లు కావాలనుకుంటే ఇతర కంపెనీల్లా మీరూ శిక్షణ ఇచ్చుకోవచ్చని, కానీ తమిళనాడు విద్యార్థులపై హిందీని రుద్దవద్దని అబ్దుల్లా ప్రతిస్పందించారు. హెచ్‌సీఎల్, టీసీఎస్ వంటి టెక్ సంస్థలు తమ క్లయింట్లతో సంభాషించేందుకు ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నాయని గుర్తు చేశారు.
Zoho
Tamil Nadu
Hindi
BJP

More Telugu News