Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం అవసరంలేదు!: సుప్రీంకోర్టుకు కేంద్రం

Life Ban On Convicted Politicians Harsh 6 Years Enough tells Centre To Supreme Court
  • దోషులుగా తేలిన నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్
  • సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం
  • ఆరేళ్ల నిషేధం సరిపోతుందని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవిత కాల నిషేధం చాలా కఠినమైనదని, ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల అనర్హత సరిపోతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది.

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల నిషేధం సరిపోదని, క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ అనే న్యాయవాది పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రం అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈరోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జీవితకాల నిషేధం అత్యంత కఠిన చర్య అని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల నిషేధం సరిపోతుందని అఫిడవిట్‌లో పేర్కొంది. 

క్రిమినల్ కేసులలో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాలం నిషేధం విధించాలా? ఆరేళ్ల నిషేధం విధించాలా? అనేది పార్లమెంటు పరిధిలోని అంశమని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. పార్లమెంటు ఇప్పటికే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆరేళ్ల నిషేధం విధించిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది.
Supreme Court
Central Government
Politics

More Telugu News