KTR: ఈ విషయంలో స్టాలిన్ కు నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా: కేటీఆర్

KTR offers strong support to Stalin on proposed Delimitation by Centre
  • దక్షిణాది రాష్ట్రాల మెడపై డీలిమిటేషన్ కత్తి వేలాడుతోందన్న స్టాలిన్
  • అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో 100 వరకు లోక్ సభ సీట్లు తగ్గిపోతాయని వెల్లడి
  • కేంద్రం వైఖరి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్న కేటీఆర్
  • స్టాలిన్ వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నామంటూ ట్వీట్ 
జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్ విభజన (డీలిమిటేషన్) జరిగితే, తమిళనాడులో 8 పార్లమెంట్ సీట్ల కోత తప్పదని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్ కరాఖండీగా చెప్పారు.

ఇది ఒక్క తమిళనాడుపైనే కాకుండా దక్షిణాది రాష్ట్రాలన్నింటిపైనా ప్రభావం చూపుతుందని, డీలిమిటేషన్ కారణంగా దక్షిణ భారతదేశంలో 100 వరకు లోక్ సభ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని స్టాలిన్ వివరించారు. దక్షిణాది రాష్ట్రాలు ఎంతో మెరుగైన విధానాలతో విజయవంతంగా జనాభా నియంత్రణ చేశాయని, కానీ ఇప్పుడిలా డీలిమిటేషన్ కారణంగా నష్టపోయేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి నష్టదాయక విధానాలకు చోటివ్వరాదని, న్యాయబద్ధమైన, పారదర్శక, సమభావంతో కూడిన విధానం ఉండాలని స్టాలిన్ పేర్కొన్నారు. 

కాగా, స్టాలిన్ వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. డీలిమిటేషన్ అంశంలో స్టాలిన్ కు తన సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నానని తెలిపారు. స్టాలిన్ వాదనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. దేశానికి అవసరమైన సమయంలో జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు, ఇప్పుడిలా నష్టం చేకూరేలా వ్యవరించడం తగదని కేటీఆర్ స్పష్టం చేశారు. 

దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని, ఈ విషయాన్ని విస్మరించి నియోజకవర్గాల పునర్ విభజన (డీలిమిటేషన్)ను అమలు చేయాలని కేంద్రం భావిస్తుండడం ప్రజాస్వామ్య వ్యతిరేకం, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒకవేళ కేంద్రం డీలిమిటేషన్ కు పట్టుబడితే... కేంద్రానికి రాష్ట్రాల నుంచి వెళుతున్న ఆదాయం ఆధారంగా డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు. 

దేశాభివృద్ధిలో తెలంగాణ, ఇతర దక్షిణాది రాష్ట్రాల పాత్రను ఎవరూ తోసిపుచ్చలేరని స్పష్టం చేశారు. భారతదేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8 శాతం కావొచ్చేమో కానీ, దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.2 శాతం కంటే ఎక్కువగా ఉందన్న విషయం మరువరాదని పేర్కొన్నారు.
KTR
Stalin
Delimitation
Southern States
India

More Telugu News