Nara Lokesh: క్రికెట్ మ్యాచ్ కు హాజరవడంపై మంత్రి నారా లోకేశ్ స్పందన

Nara Lokesh responded to criticism over his attendance at the India and Pakistan match in Dubai
  • దుబాయ్ లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్
  • హాజరైన ఏపీ మంత్రి నారా లోకేశ్
  • తీవ్ర విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు
  • దేశభక్తి ఉంది కాబట్టే ఆ మ్యాచ్ కు వెళ్లానన్న నారా లోకేశ్
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కొన్ని రోజుల కిందట దుబాయ్ లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు హాజరయ్యారు. ఓవైపు గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే, మంత్రి లోకేశ్ క్రికెట్ మ్యాచ్ లకు వెళ్లారంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై లోకేశ్ ఇవాళ శాసనమండలిలో స్పందించారు. 

ఆ రోజు జరిగింది భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కాబట్టి, చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని, తనకు కూడా మ్యాచ్ చూడాలని ఉండడంతో దుబాయ్ వెళ్లానని వెల్లడించారు. దేశభక్తి ఉంది కాబట్టే ఆ మ్యాచ్ కు వెళ్లానని వివరించారు. కానీ, దానిపై కూడా ఎగతాళి చేశారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

దుబాయ్ వెళ్లి ఐసీసీ చైర్మన్ జై షాను కలిశానని, ఏపీ రాజధాని అమరావతిలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం కంటే పెద్ద స్టేడియం కడతామని ఆయనకు చెప్పానని వెల్లడించారు. దేశంలో అతి పెద్ద స్టేడియం అమరావతిలో కట్టేందుకు జై షా ఒప్పుకున్నారని లోకేశ్ తెలిపారు. 

"అహ్మదాబాద్ స్టేడియం నిర్మాణానికి ఎంత ఖర్చుపెట్టారు? అది కేవలం క్రికెట్ కే కాకుండా, ఇతర కార్యకలాపాల కోసం ఎలా వాడుతున్నారో కూడా ఆయన నాకు వివరించారు. బహుళ ప్రయోజకంగా స్టేడియం ఉండాలని మోదీ స్టేడియం నిర్మించాం... మీరు కూడా అలాంటి స్టేడియంనే కట్టండి అని ఆయన సూచించారు. మాకు చిత్తశుద్ధి ఉంది... దుబాయ్ మ్యాచ్ కు వెళ్లి కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దుబాయ్ చిన్న స్టేడియం అయినా కూడా వాళ్ల ఎలా మేనేజ్ చేస్తున్నారు? సీటింగ్ ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది? అవన్నీ నేను పరిశీలించాను" అని లోకేశ్ వివరించారు. 

ఇక, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాప్ చైర్మన్ తో మాట్లాడానని, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడితోనూ మాట్లాడానని... గ్రామ స్థాయి నుంచే క్రికెట్, ఇతర క్రీడల్లో యువతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
Nara Lokesh
India-Pakistan Match
Dubai
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News