UP Woman: బర్రెలు కొనుక్కోవడానికి రెండో పెళ్లికి సిద్ధమైన యూపీ మహిళ... అత్తామామలు రావడంతో ఆగిన పెళ్లి

UP Woman Attempts Second Marriage To Buy Buffaloes Caught By In Laws
  • సామూహిక వివాహం చేసుకున్న జంటలకు యూపీ సర్కారు రూ.35 వేల నజరానా
  • ఆ డబ్బుల కోసం బంధువుతో కలిసి పెళ్లి నాటకం
  • ప్రభుత్వం ఇచ్చే సొమ్ము, ఇతర కానుకలు చెరి సగం పంచుకునేలా ఒప్పందం
ఓ మహిళకు మూడేళ్ల క్రితమే పెళ్లి అయింది. భర్తతో గొడవల నేపథ్యంలో ఆరు నెలల క్రితం పుట్టింటికి చేరింది. విడాకుల కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే, సామూహిక వివాహం చేసుకునే జంటలకు ప్రభుత్వం రూ.35 వేలు, ఇతర కానుకలు ఇస్తుందని తెలిసి సమీప బంధువుతో కలిసి పెళ్లి నాటకానికి తెరలేపింది. తీరా పెళ్లి జరుగుతుండగా అత్తామామలు ఎంట్రీ ఇవ్వడంతో ఆ మహిళ ప్లాన్ బెడిసికొట్టింది. 

యూపీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకెళితే... హసన్ పూర్ కు చెందిన ఆస్మా మూడేళ్ల క్రితం నూర్ మహ్మద్ ను పెళ్లి చేసుకుంది. అయితే, భర్తతో మనస్పర్ధల కారణంగా ఆరు నెలల క్రితం విడాకులకు దరఖాస్తు చేసింది.

ఆ కేసు ఇంకా తేలక ముందే సీఎం మాస్ మ్యారేజ్ స్కీంలో మరో వివాహానికి సిద్ధమైంది. విషయం తెలుసుకున్న నూర్ మహ్మద్ తల్లిదండ్రులు మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుని వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. దానిని పరిశీలించిన తర్వాత నిర్వాహకులు పోలీసులను పిలిపించి ఆస్మా, ఆమెకు కాబోయే భర్తపై ఫిర్యాదు చేశారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావని ప్రశ్నించగా, ఇది కేవలం ఓ నాటకమని, పెళ్లి జరిగాక ప్రభుత్వం ఇచ్చే డబ్బును చెరిసగం పంచుకునే ఒప్పందం చేసుకున్నామని, బర్రెలు కొనుక్కోవాలనుకున్నానని ఆస్మా వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు.
UP Woman
Second Marriage
Buffaloes
Mass Marriages
UP govt Scheeme

More Telugu News