Champions Trophy 2025: మేం 22 మంది భారత జాలర్లను విడుదల చేశాం.. భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు పీసీబీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

We Released 22 Indian Fishermen Says PCB Chief Ahead Pak India Match
  • చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్-పాక్ మ్యాచ్
  • తమ ఆటగాళ్లు పూర్తి ఫాంలో ఉన్నారన్న పీసీబీ చీఫ్ నఖ్వీ
  • మ్యాచ్ గెలిచినా, ఓడినా జట్టుతోనే ఉంటామన్న నఖ్వీ
  • పాక్ జైళ్లలో ఇప్పటి వరకు 8 మంది భారత జాలర్ల మృతి
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో తమ జట్టు గెలుపుపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. శిక్షణ పొందుతున్న తమ ఆటగాళ్లను కలిశారు. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మాత్రం శిక్షణలో కనిపించలేదు. ఆటగాళ్లను కలిసిన అనంతరం నఖ్వీ మాట్లాడుతూ.. ఇవాళ మంచి మ్యాచ్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ జట్టు పూర్తిగా సన్నద్ధమైందని, ఆటగాళ్లు ఫాంలో ఉన్నారని చెప్పారు. మ్యాచ్ గెలిచినా, ఓడినా జట్టుతోనే ఉంటామని పేర్కొన్నారు. 

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు గెలవడం అత్యావశ్యకం. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓడిన పాక్.. నేడు భారత్ చేతిలోనూ ఓడితే సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. రోహిత్ సేన విజయం సాధిస్తే సెమీస్‌కు మరింత దగ్గరవుతుంది. భారత్-పాక్ మ్యాచ్ లాహోర్‌లో జరిగి ఉంటే మీకెలా అనిపించేదన్న విలేకరుల ప్రశ్నకు నఖ్వీ బదులిస్తూ.. ఆ ప్రశ్న ఏదో భారతీయులనే అడగాలన్నారు. కాగా, చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ భారత్ మాత్రం తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. 

కాగా, భారత్‌తో మ్యాచ్‌కు ముందు తమ వైపు నుంచి 22 మంది భారతీయ జాలర్లను విడుదల చేసినట్టు నఖ్వీ పేర్కొన్నారు. కరాచీలోని మాలిర్ జైలులో మగ్గుతున్న 22 మంది భారత జాలర్లను విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, శిక్ష పూర్తయినా, అతడు భారతీయుడని తెలిసినా పాక్ అధికారులు విడిచిపెట్టకపోవడంతో జనవరి 23న కరాచీ జైలులో భారత జాలరి ఒకరు మరణించారు. దీంతో పాక్ జైళ్లలో మరణించిన భారత జాలర్ల సంఖ్య 8కి చేరుకుంది. అలాగే, శిక్షా కాలం పూర్తి చేసుకున్న 180 మంది భారత జాలర్లు విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. వారిని విడుదల చేయాలని భారత్ చేస్తున్న విజ్ఞప్తులను పాక్ పెడచెవిన పెడుతోంది. కాగా, శుక్రవారం 15 మంది భారత జాలర్ల బృందం శ్రీలంక నుంచి చెన్నైకి చేరుకుంది. అనంతరం వారిని స్వగ్రామాలకు తరలించారు. 
Champions Trophy 2025
Team India
Team Pakistan
Mohsin Naqvi

More Telugu News