Irfan Pathan: పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు.. టీమిండియానే ఫేవ‌రెట్: ఇర్ఫాన్ ప‌ఠాన్‌

Irfan Pathan Says India Favourites Against Pakistan
  • రేపు దుబాయ్ వేదిక‌గా దాయాదుల పోరు
  • తొలి మ్యాచ్‌లో ఓట‌మి భారంతో ఆతిథ్య పాక్‌
  • బంగ్లాపై మొద‌టి మ్యాచ్‌లోనే గెలుపుతో ఊపు మీదున్న భార‌త్‌
  • పాక్ జ‌ట్టులో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌న్న ఇర్ఫాన్ ప‌ఠాన్‌
  • అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న‌ టీమిండియాను నిలువ‌రించ‌డం అంత సులువు కాద‌ని వ్యాఖ్య‌ 
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. రేపు దుబాయ్ వేదిక‌గా భార‌త్‌, పాక్ త‌ల‌ప‌డ‌నున్నాయి. మొద‌టి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి ఊపు మీదున్న టీమిండియాను, తమ తొలి మ్యాచ్‌లోనే ఓట‌మితో కంగుతిన్న ఆతిథ్య పాక్ నిలువ‌రించ‌డం అంత సులువు కాద‌ని భార‌త మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ అన్నారు. భార‌త్ అన్ని విభాగాల‌లో బలంగా ఉందని, పాక్ జ‌ట్టులో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. 

"ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో పాకిస్థాన్ పూర్తిగా వెనుక‌బ‌డింది. మోడ‌ర్న్ డే క్రికెట్ ఆడ‌టంలో ఆ దేశ ఆటగాళ్లు విఫ‌ల‌మ‌వుతున్నారు. ఆ జ‌ట్టులోని సీనియ‌ర్ ప్లేయ‌ర్లు త‌మ స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోతున్నారు. వారి ఆట ఇంకా ఆందోళ‌న‌కరంగానే ఉంది. కివీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వారి ఆట‌తీరును అంద‌రూ చూశారు. 

ఇక దాయాదుల పోరులో భావోద్వేగం, ఒత్తిడి అనేవి కామ‌న్‌. ఎవ‌రు వాటిని సరిగ్గా హ్యాండిల్ చేస్తారో వారే విజేత‌గా నిలుస్తారు. ఇటీవ‌ల స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన సిరీస్ లో ఒత్తిడిలోనూ భార‌త్ అద్భుతంగా ఆడింది. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో మంచి ప్ర‌తిభ ఉన్న ఆట‌గాళ్లు టీమిండియాకు చాలా మంది ఉన్నారు. 

గాయం త‌ర్వాత క‌మ్‌బ్యాక్ చేసిన మ‌హ్మ‌ద్ ష‌మీ తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల‌తో స‌త్తాచాటాడు. పేస‌ర్లు గాయం నుంచి కోలుకుని, క‌మ్‌బ్యాక్ చేసి రాణించ‌డం అంత సులువు కాదు. కానీ, ష‌మీ అద్భుత‌మే చేశాడు. అత‌నికి ఐసీసీ ఈవెంట్లు అంటే చాలు. ఓ రేంజ్‌లో రెచ్చిపోతాడు. 

ప్ర‌స్తుతం టీమిండియా నాణ్య‌మైన ఆల్‌రౌండ‌ర్లు ఉన్నారు. అక్ష‌ర్ ప‌టేల్ బాల్‌తో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. జ‌డేజా, హార్దిక్ ఎప్పుడూ నిరాశ‌ప‌రచ‌రు. వారి స్థాయికి త‌గ్గ ఆట‌తో ఆక‌ట్టుకోవ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ భీక‌ర‌మైన ఫామ్‌లో ఉన్నాడు. అటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తిరిగి ఫామ్ అందుకోవ‌డం జ‌ట్టుకు ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంది. రోహిత్‌, విరాట్ కోహ్లీ ర‌న్స్ కొట్ట‌డం మొద‌లు పెడితే వారిని ఆప‌డం ఎవ‌రిత‌ర‌మూ కాదు" అని ఇర్ఫాన్ ప‌ఠాన్ చెప్పుకొచ్చాడు.    
Irfan Pathan
IND vs PAK
Champions Trophy 2025
Cricket
Sports News

More Telugu News