Sanjana Ganesan: "భ‌య‌ప‌డ‌కండి.. అతను ఇక్కడికి రావడం లేదు"... బంగ్లా స్టార్‌తో బుమ్రా భార్య‌ ఫన్నీ చాట్!

He Is Not Coming Here Sanjana Ganesans Funny Chat With Bangladesh Star Over Jasprit Bumrah Goes Viral
  • వెన్నునొప్పి కార‌ణంగా ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూర‌మైన బుమ్రా
  • ఈ క్ర‌మంలో బంగ్లా ప్లేయ‌ర్‌ మెహిదీ హసన్ మీరాజ్ తో బుమ్రా భార్య సంజ‌న ఫన్నీ చాట్
  • బుమ్రా చాలా భిన్నమైన బౌలర్, చాలా ప్రమాదకరం కూడా అన్న మీరాజ్‌  
  • మా ఆయ‌న‌ ఇక్కడికి రావడం లేదులెండి అంటూ సంజన ఫ‌న్నీ రిప్లై
క్రికెట్ ప్రెజెంటర్, భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేషన్‌కు బంగ్లాదేశ్ స్టార్ ప్లేయ‌ర్‌ మెహిదీ హసన్ మీరాజ్ మధ్య జరిగిన ఒక ఫన్నీ సంభాషణ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చాట్ సందర్భంగా ఇద్దరూ స్పీడ్‌స్ట‌ర్‌ బుమ్రా గురించి మాట్లాడ‌టం వీడియోలో ఉంది.

"అతను చాలా భిన్నమైన బౌలర్, చాలా ప్రమాదకరం కూడా" అని మెహిదీ అన్నాడు. దీనికి సంజ‌న‌ "భ‌య‌ప‌డ‌కండి.. అతను ఇక్కడికి రావడం లేదులెండి" అని బదులిచ్చారు. అప్పుడు మెహిదీ "అవును, నాకు తెలుసు. మేము చాలా సంతోషంగా ఉన్నాము" అన్నాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ స్టార్.. బుమ్రా ఎలా ఉన్నాడని అడిగాడు. "అతను బాగానే ఉన్నాడు. ప్రస్తుతం నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో శిక్షణ పొందుతున్నాడు" అని సంజన అన్నారు.

ఇదిలాఉంటే... ఈ ఏడాది జనవరిలో బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన ఐదో టెస్టులో బుమ్రా వెన్నునొప్పితో బాధ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. దాని నుంచి పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూర‌మ‌య్యాడు.

మొద‌ట ఈ మెగా ఈవెంట్ కు ప్ర‌క‌టించిన తాత్కాలిక జ‌ట్టులో బుమ్రాకు చోటు క‌ల్పించిన బీసీసీఐ ఆ త‌ర్వాత గాయం కార‌ణంగా జ‌ట్టు నుంచి త‌ప్పించింది. ఈ మేర‌కు బోర్డు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. వెన్నునొప్పి కారణంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. సెలక్షన్ కమిటీ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేసింది" అని బీసీసీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

కాగా, ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్ తో జ‌రిగిన తొలి మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. రేపు దాయాది పాకిస్థాన్ తో టీమిండియా రెండో మ్యాచ్ లో త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం మార్చి 2న న్యూజిలాండ్ తో ఆడ‌నుంది. 
Sanjana Ganesan
Jasprit Bumrah
Mehidy Hasan Miraz
Team India
Cricket
Sports News

More Telugu News