Champions Trophy 2025: బంతితో షమీ.. బ్యాట్‌తో గిల్.. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం

Gill ton and Mohammed Shami five fer give India a winning start
  • తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్
  • తొలుత 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను కుప్పకూల్చిన షమీ
  • ఆ తర్వాత శతకంతో భారత్‌కు విజయాన్ని అందించిన గిల్
చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు శుభారంభం చేసింది. గత రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితోను, బ్యాట్‌తోనూ చెలరేగిపోయింది. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన పేసర్ మహ్మద్ షమీ బంతితో చెలరేగితే, యువ ఆటగాడు శుభమన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. వెరసి తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీని ఘనంగా ప్రారంభించింది. 

దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తౌహిద్ హృదయ్ శతకం పుణ్యమా అని 228 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. అనంతరం 229 పరుగుల ఓ మాదిరి విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 46.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. 

కెప్టెన్ రోహిత్‌శర్మ 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేయగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుభమన్ గిల్ శతక్కొట్టాడు. 129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 22 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. శ్రేయాస్ అయ్యర్ 15, అక్షర్ పటేల్ 8 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 41 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొసైన్ 2 వికెట్లు తీసుకున్నాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. టీమిండియా స్టార్ పేసర్ షమీ దెబ్బకు విలవిల్లాడింది. ఒకానొక దశలో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 100 పరుగులైనా చేస్తుందా? అన్న సందేహాల మధ్య అనూహ్యంగా పుంజుకుంది. భారత బౌలర్లను ఎదురొడ్డిన తౌహిద్ హృదయ్ సెంచరీ (100)తో జట్టుకు జీవం పోశాడు. 118 బంతులు ఎదుర్కొన్న తౌహిద్ 6 ఫోర్లు, 2 సిక్సర్లతో సరిగ్గా వంద పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జాకెర్ అలీ 68 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. 

జట్టులో నలుగురు ఆటగాళ్లు డకౌట్ కాగా, ఇద్దరు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మస్తాఫిజుర్ ఖాతా తెరవకుండా నాటౌట్‌గా మిగిలాడు. మొత్తంగా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 228 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. మహ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టగా, హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బిలో నేడు ఆఫ్ఘనిస్థాన్-సౌతాఫ్రికా జట్లు కరాచీలో తలపడతాయి.
Champions Trophy 2025
Team India
Team Bangladesh
Dubai
Shubman Gill
Mohammed Shami

More Telugu News