పనామా హోటల్ లో భారత అక్రమ వలసదారులు.. బంధించారా? బస కల్పించారా?
- అమెరికా నుంచి 300 మంది అక్రమ వలసదారులను పనామా తరలించిన అధికారులు
- సాయం చేయండంటూ హోటల్ కిటికీల నుంచి బాధితుల వేడుకోలు
- స్వదేశానికి వెళ్లడానికి సగం మంది ఇష్టపడడం లేదంటున్న అధికారులు
హోటల్ గదిలోని కిటికీల నుంచి అక్రమ వలసదారులు సాయం కోరుతూ విజ్ఞప్తులు చేస్తున్నారు. పేపర్ మీద హెల్ప్ అని రాసి ప్లకార్డుల మాదిరిగా ప్రదర్శిస్తున్నారు. కొంతమంది కన్నీళ్లు పెడుతూ వేడుకోవడం కనిపిస్తోంది. కాగా, అమెరికా ఖర్చుతో అక్రమ వలసదారులకు వసతి కల్పించామని, వారిని మాతృదేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని పనామా ప్రభుత్వం తెలిపింది. స్వచ్ఛందంగా తిరిగి వెళ్లిపోవాలని వారికి సూచించింది. అయితే, మొత్తం 300 మందిలో 171 మంది మాత్రమే తమ దేశానికి వెళ్లిపోతామని చెప్పారని, మిగతావారు అందుకు ఇష్టపడడం లేదని పనామా అధికారులు చెబుతున్నారు. స్వదేశాలకు వెళ్లడానికి ఇష్టపడని వారికి తాత్కాలికంగా తమ దేశంలోనే వసతి కల్పిస్తామని, వారి విషయంలో ఏం చేయాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
