Dasoju Sravan: అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

Dasoju Sravan and RSP complaint on Telugu Vibe twitter handle
  • ఒక ట్విట్టర్ హ్యాండిల్‌పై దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు
  • రేవంత్ రెడ్డికి చిల్లర ప్రచారాలు, చిల్లర వేషాలు ఎక్కువయ్యాయన్న దాసోజు శ్రవణ్
  • కేసీఆర్, హరీశ్ రావు మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తోన్న ఓ వెబ్ ఎక్స్ హ్యాండిల్‌పై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, చెల్లని రూపాయికి గీతలెక్కువ అని, చేతకాని రేవంత్ రెడ్డికి చిల్లర ప్రచారాలు, చిల్లర వేషాలు ఎక్కువ అయ్యాయని విమర్శించారు.

బీఆర్ఎస్‌పై బురద జల్లుతున్న ఒక ట్విట్టర్ హ్యాండిల్ మీద సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, నాయకత్వంపై చిల్లర విమర్శలు చేస్తోందని, కేసీఆర్, హరీశ్ రావు మధ్య విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, హరీశ్ రావులపై తప్పుడు పోస్టులు పెట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలని రేవంత్ రెడ్డి కుట్రకు తెరలేపారని ఆరోపించారు.

అబద్ధపు కథనాలతో తమ పార్టీ కేడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్న ట్విట్టర్ హ్యాండిల్‌పై చర్యలు తీసుకోవాలని, దాని వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

హరీశ్ రావు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సామాజిక మాధ్యమాన్ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తూ, తమ పార్టీ నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందన్నారు. బీఆర్ఎస్‌పై అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తల దారుణాలను మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 
Dasoju Sravan
RS Praveen Kumar
BRS
Cybercrime

More Telugu News