Harbhajan Singh: అత‌డు మ్యాచ్‌ను లాగేసుకోవ‌చ్చు జాగ్ర‌త్త‌.. టీమిండియాకు భ‌జ్జీ వార్నింగ్‌!

Harbhajan Singh Warns India Of Pakistan Star Ahead Of Champions Trophy Clash
  • రేప‌టి నుంచి ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం
  • ఫిబ్రవరి 23న దుబాయ్ లో దాయాదుల పోరు
  • ఈ నేప‌థ్యంలో మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు
  • ఫక‌ర్ జ‌మాన్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలన్న హర్భజన్ సింగ్
రేప‌టి నుంచి ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి తెర లేవ‌నుంది. అయితే, ఈ మెగా ఈవెంట్ లో దాయాదుల పోరునే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. ఫిబ్రవరి 23న దుబాయ్ లో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు భార‌త మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. 

భారత్ నుంచి ఆటను దూరం చేసే అనుభవం ఉన్న ఫకార్ జ‌మాన్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాను హర్భజన్ హెచ్చరించాడు. "ఫకార్ కు మంచి అనుభవం ఉంది. అతను భారత్ నుంచి మ్యాచ్ ను లాగేసుకోవ‌చ్చు" అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్ లో అన్నాడు.

అటు వన్డేల్లో మెన్ ఇన్ బ్లూపై ఈ పాక్ ఆట‌గాడికి అద్భుతమైన రికార్డు ఉంది. భార‌త్ పై ఆరు మ్యాచ్ ల్లో  82.39 స్ట్రైక్ రేట్‌, 46.80 సగటుతో 234 పరుగులు సాధించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైన‌ల్ లో భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్లు ఓవల్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఫకార్ అద్భుత‌మైన శ‌త‌కంతో పాక్ కు భారీ స్కోర్ అందించాడు.

ఈ ఫైన‌ల్ పోరులో అత‌డు 106 బంతుల్లో 114 పరుగులు చేయ‌డంతో పాకిస్థాన్‌ 338/4 స్కోరు చేసింది. ఆ త‌ర్వాత భార‌త ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన భార‌త్ చ‌తికిల ప‌డింది. దాంతో 180 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాయాది దేశం టైటిల్ ఎగిరేసుకుపోయింది. ఈ నేప‌థ్యంలోనే భ‌జ్జీ తాజాగా ఫ‌క‌ర్ జ‌మాన్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించాడు.
Harbhajan Singh
Team India
Fakhar Zaman
Champions Trophy 2025
Cricket
Sports News

More Telugu News