Champions Trophy 2025: భారత జట్టు కొత్త జెర్సీపై పాకిస్థాన్ పేరు.. ఫస్ట్ గ్లింప్స్ ఇదిగో!

Champions Trophy First glimpse of Indias jersey out features Pakistan imprint
  • తొలుత పాకిస్థాన్ పేరును జెర్సీపై ముద్రించేందుకు బీసీసీఐ నిరాకరణ
  • ఐసీసీ జోక్యంతో జెర్సీపై పాక్ పేరును ముద్రించిన బీసీసీఐ
  • జెర్సీ ఫొటోలు షేర్ చేసిన ఐసీసీ
  • 23న పాకిస్థాన్‌తో తలపడనున్న భారత జట్టు
చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం కొత్త జెర్సీని భారత జట్టు సోమవారం ఆవిష్కరించింది. సారథి రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ కొత్త జెర్సీలు ధరించి కెమెరాలకు పోజిచ్చారు. ఈ జెర్సీలపై ఆతిథ్య పాకిస్థాన్ పేరును ముద్రించడం అందరినీ ఆకర్షించింది. ఈ కొత్త జెర్సీతో ఐసీసీ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల ఫొటోలను ఐసీసీ పంచుకుంది. జెర్సీపై ‘చాంపియన్స్ ట్రోఫీ 2025, పాకిస్థాన్‘ అని ముద్రించారు. 

ఆతిథ్య దేశం పేరును టోర్నీలో ఆడే జట్ల కిట్లపై ముద్రించడం ఆనవాయితీ. అయితే, భారత జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో వివాదం మొదలైంది. తాము పాకిస్థాన్‌లో ఆడటం లేదు కాబట్టి పాక్ పేరును ముద్రించాల్సిన అవసరం లేదని బీసీసీఐ వాదించింది. అయితే, ఐసీసీ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. భారత జెర్సీపై పాక్ పేరు ముద్రించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. 2023లో పాకిస్థాన్‌లో జరిగిన ఆసియాకప్ సమయంలోనూ ఏ జట్టు తమ జెర్సీపై పాక్ పేరును ముద్రించలేదు. 

కాగా, ఐసీసీ ‘వన్డే టీం ఆఫ్ ద ఇయర్’గా రోహిత్ శర్మ, ‘టెస్ట్ టీం ఆఫ్ ద ఇయర్’గా జడేజా అవార్డులు అందుకోగా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ ‘ఐసీసీ టీ20 టీం ఆఫ్ ద ఇయర్‌‘గా అవార్డులు అందుకున్నారు. అలాగే, ‘టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌’, ‘మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ఇయర్’గా అర్షదీప్ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నాడు. కాగా, చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఈ నెల 23న జరగనుంది. 
Champions Trophy 2025
Team India Jersey
Team Pakistan
ICC
BCCI

More Telugu News