Gautam Gambhir: శ్రేయాస్ అయ్యర్‌కు జట్టులో చోటు.. తీవ్రస్థాయిలో గొడవ పడిన గంభీర్-అగార్కర్

Gambhir goes against Agarkar as India have heated selection meeting over Shreyas Iyer
  • ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల్లోనూ పంత్‌కు దక్కని చోటు
  • పట్టుబట్టి మరీ శ్రేయాస్ అయ్యర్‌ను తెచ్చుకున్న గంభీర్
  • విలేకరుల సమావేశంలో బయటపడిన విభేదాలు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. అయితే, చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టు విషయంలో కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవడమే ఇందుకు కారణం.

ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల్లోనూ రాహుల్‌ ఆడగా, సెకండ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం దక్కలేదు. జట్టులో వికెట్ కీపర్ స్థానం పంత్‌దేనని, అతడినే తుది జట్టులో ఆడించాలని అగార్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే, గంభీర్ మాత్రం రాహుల్‌కే తమ తొలి ప్రాధాన్యమని విలేకర్ల సమావేశంలోనే చెప్పడంపై జట్టులో పంత్ స్థానం సంగతేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ బాగా ఆడుతున్నాడని, ఇద్దరు వికెట్ కీపర్లను ఆడించడం వీలుకాదని గంభీర్ తెగేసి చెప్పేశాడు. 

మరోవైపు, ఎడమచేతి వాటం బ్యాటర్ కావాలనుకున్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్‌ను ముందు పంపిస్తుండటంతో పంత్‌కు జట్టులో స్థానం కష్టమవుతోంది. అక్షర్ కూడా బాగానే రాణిస్తున్నాడు. తొలి రెండు వన్డేల్లో వరుసగా 52, 41 పరుగులు చేశాడు. ఇక గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా గొప్పగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో 181 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీకి కూడా అతడిని ఎంపిక చేశారు. అయితే, అటు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు, ఇటు చాంపియన్స్ ట్రోఫీకి శ్రేయాస్‌ను ఎంపిక చేయడం అగర్కర్‌కు ఇష్టం లేదని సమాచారం. అయినప్పటికీ గంభీర్ బలవంతంతో అతడికి చోటివ్వక తప్పలేదు. గంభీర్-అగార్కర్ మధ్య వాగ్వివాదానికి ఇదే కారణమని తెలుస్తోంది.
Gautam Gambhir
Ajit Agarkar
Team India
Shreyas Iyer
Rishabh Pant

More Telugu News