ap minister satya kumar yadav: పుష్ప-2 వంటి చిత్రాలు చూసి చిన్నారులు ఏం నేర్చుకుంటారు?: ఏపీ మంత్రి సత్యకుమార్

ap minister satya kumar yadav sensational comments on Movies
  • బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలతో సినిమాలు తీయడం ఏమిటన్న మంత్రి సత్యకుమార్ 
  • నేర ప్రవృత్తితో తీసే సినిమాలతో సమాజంలో అవే ధోరణులు పెరిగిపోతాయని ఆందోళన
  • నంద్యాల గురు రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ సొసైటి 23వ వార్షికోత్సవ వేడుకల్లో సినిమాలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బందిపోట్లు, స్మగ్లర్ల జీవిత చరిత్రలతో తీయడం ఏమిటని, వీటి ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తమ జన్మస్థలాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుల జీవితాలను ఇతివృత్తాలుగా ఎంచుకుని సినిమాలు తీస్తే సమాజానికి మేలు చేసిన వారవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. 

నంద్యాల పట్టణంలో శనివారం గురు రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ 23వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్షికోత్సవ సంచికను ఆవిష్కరించారు. బ్యాంకు ఉద్యోగాల కోచింగ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నంద్యాల గురు రాఘవేంద్ర సంస్థకు మంచి పేరుందని ఆయన కొనియాడారు. ఈ సంస్థలో శిక్షణ పొందిన వేలాది మంది యువతీ యువకుల్లో దాదాపు 43 వేల మందికి పైగా బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డిని మంత్రి సత్యకుమార్ అభినందిస్తూ .. దస్తగిరి లాంటి వారి జీవిత చరిత్రలతో సినిమాలు తీస్తే సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం వస్తున్న సినిమాలు, వాటిలో చూపిస్తున్న కథలు, జీవిత చరిత్రలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని ఆయన అన్నారు. నేర ప్రవృత్తితో సినిమాలు తీయడం వల్ల సమాజంలో అవే ధోరణులు పెరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడేలా సినిమాలు తీస్తే బాగుంటుందని ఆయన సూచించారు. తాను ఏ ఒక్కరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. అయితే, ఆయన పుష్ప -2 సినిమాను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. 
ap minister satya kumar yadav
nandyal
Movies
puspa 2

More Telugu News