CID DSP: రాజమండ్రిలో గుడి వద్ద విగత జీవిగా సీఐడీ డీఎస్పీ

CID DSP dead body found near a temple
  • తొలుత గుర్తు తెలియని వ్యక్తిగా భావించిన పోలీసులు
  • ఆ తర్వాత డీఎస్పీ నాగరాజుగా గుర్తింపు 
  • ఏడాది క్రితమే కర్నూలు నుంచి రాజమహేంద్రవరానికి ట్రాన్స్‌ఫర్
ఎస్సైగా సర్వీసులో చేరి సీఐడీ డీఎస్సీ స్థాయికి ఎదిగిన ఓ పోలీసు అధికారి రాజమహేంద్రవరంలోని ఓ గుడి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించారు. తొలుత ఆయనను గుర్తు తెలియని వ్యక్తిగా భావించారు. ఆ తర్వాత ఆయనను డీఎస్పీగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గాంధీపురం పరిధిలోని ఎస్ఆర్ఎంటీ గోదాము సమీపంలో సాయిబాబా గుడి వద్ద ఓ మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన ఫొటోను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఆయనను కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన సీఐడీ డీఎస్పీ బి.నాగరాజు (54)గా గుర్తించారు. 

నాగరాజు ఏడాది క్రితం రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. లాడ్జిలో ఉంటూ విధులకు హాజరయ్యేవారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌ నుంచి మెడికల్ లీవులో ఉన్నారు. ఈ నెల 2న కర్నూలు నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. లాడ్జిలో ఉంటూ విధులకు వెళ్లి వచ్చేవారు. ఈ నెల 10న చివరిసారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ అయింది.

దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. విషయం తెలిసి హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన కుమారుడు వంశీకృష్ణ నిన్న ఉదయం రాజమహేంద్రవరం చేరుకుని తండ్రి గురించి ఆరా తీశారు. దీంతో నాగరాజు విధులకు హాజరు కావడం లేదని చెప్పారు. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన ఫొటోను సీఐడీ సిబ్బంది గుర్తించి ప్రకాశం నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
CID DSP
Rajamahendravaram
Kurnool District

More Telugu News