Malkajgiri BJP MP: కుంభమేళాలో పుణ్య స్నానం కోసం పది కిలోమీటర్లు నడిచిన ఎంపీ ఈటల

Etela Rajender Walked 10 Kilometers To Reach Triveni Sangam
  • ప్రత్యేక ఏర్పాట్లు తిరస్కరించి సామాన్యుడిలా త్రివేణీ సంగమానికి చేరుకున్న ఎంపీ
  • మాజీ ఎంపీ బీబీ పాటిల్ సహా అనుచరులతో కలిసి పుణ్యస్నానం
  • ప్రయాగ్ రాజ్ కు పోటెత్తుతున్న భక్తులు 
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధిగా తనకున్న ప్రత్యేక ప్రొటోకాల్ ను కాదనుకుని సామాన్యుడిలా అనుచరులతో కలిసి 10 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. ఎంపీ ఈటల మిగతా భక్తులతో కలిసి నడుస్తున్న వీడియోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈటల రాజేందర్ వెంట మాజీ ఎంపీ బీబీ పాటిల్ తో పాటు అనుచరులు ఉన్నారు. కాలినడకన త్రివేణి సంగమానికి చేరుకున్న ఎంపీ ఈటల, బీబీ పాటిల్ పుణ్య స్నానం ఆచరించారు. స్థానిక పూజారులు ఎంపీ ఈటల బృందంతో పూజలు చేయించారు. 

బుధవారం మాఘ పూర్ణిమ కావడంతో ప్రయాగ్ రాజ్ కు భక్తులు పోటెత్తారు. ఇటీవలి తొక్కిసలాట నేపథ్యంలో యూపీ అధికారులు ప్రయాగ్ రాజ్ ను నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. కుంభమేళా ముగింపు దగ్గరపడుతుండడంతో ప్రయాగ్ రాజ్ కు భక్తుల తాకిడి పెరిగింది. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. ఈ నెల 26న మహాశివరాత్రితో మహా కుంభమేళ ముగియనుంది. చివరిరోజు సుమారు 5 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందనే అంచనాలతో యూపీ సర్కారు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
Malkajgiri BJP MP
Etala Rajender
Prayag Raj
Kumbh Mela
Triveni Sangam

More Telugu News