Jasprit Bumrah: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో జ‌స్ప్రీత్‌ బుమ్రా ఆడ‌తాడా?.. తేలేది నేడే!

Jasprit Bumrah Champions Trophy Fate May Be Decided Today
  • ఈ నెల 19 నుంచి పాక్‌, దుబాయ్ వేదిక‌ల‌లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం 
  • ఈ టోర్నీలో బుమ్రా ఆడ‌తాడా? లేదా? అనే దానిపై ఉత్కంఠ
  • జ‌ట్టులో మార్పుల‌కు ఇవాళ్టితో ముగియ‌నున్న ఐసీసీ గ‌డువు
  • వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్న స్పీడ్‌స్ట‌ర్ పై నేడు నిర్ణ‌యం తీసుకోనున్న బీసీసీఐ
ఈ నెల 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌ల‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో జ‌స్ప్రీత్‌ బుమ్రా ఆడ‌తాడా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. జ‌ట్టులో మార్పుల‌కు ఐసీసీ ఇచ్చిన తుది గ‌డువు ఇవాళ్టితో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ నేడు బుమ్రా విష‌యంలో తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. 

ఇక 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో టీమిండియా తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన‌ బుమ్రా.. సిరీస్ చివరి టెస్ట్ నుంచి గాయం కారణంగా దూర‌మ‌య్యాడు. జనవరి మొదటి వారంలో సిడ్నీలో బౌలింగ్ చేస్తున్నప్పుడు వెన్నునొప్పి రావడంతో ఈ స్టార్ ఫాస్ట్ బౌలర్ మ్యాచ్ మధ్యలో వైదొలగాల్సి వచ్చింది. అప్పటి నుంచి అతడు ఏ క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. 

బుధవారం అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్ తో జరిగే మూడో వన్డేకు భారత జట్టులో బుమ్రాకు చోటు దక్కింది. అటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన‌ తాత్కాలిక జట్టులో కూడా బుమ్రా చోటు దక్కించుకున్న విష‌యం తెలిసిందే. బుమ్రా ఇటీవల బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో త‌న వెన్నునొప్పికి సంబంధించి స్కానింగ్ చేయించుకున్నాడు. ఈ స్కానింగ్ రిపోర్టు ఆధారంగా ఈరోజు బుమ్రా ఛాంపియ‌న్స్ ట్రోఫీ భ‌విత‌వ్యం తేల‌నుంద‌ని ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో క‌థ‌నం పేర్కొంది. 

ఇక బుమ్రా సకాలంలో ఫిట్‌గా లేకుంటే అత‌ని స్థానంలో హర్షిత్ రాణాను తీసుకునే అవకాశం ఉందని క‌థ‌నం తెలిపింది. కాగా, వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్న స్పీడ్‌స్ట‌ర్ ఇంకా పూర్తిగా కోలుకోలేద‌ని స‌మాచారం. అత‌ని ప‌రిస్థితిని మెడిక‌ల్ టీమ్ ప‌ర్య‌వేక్షిస్తోంది. ఒక‌వేళ బుమ్రా ఈ ఐసీసీ టోర్నీకి దూర‌మైతే భార‌త జ‌ట్టుకు పెద్ద లోటే అని చెప్ప‌వ‌చ్చు. 
Jasprit Bumrah
Champions Trophy 2025
Team India
Cricket
Sports News

More Telugu News