Supreme Court: కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

SC seeks Attorney General input on plea for lifetime ban on convicts from polls
  • ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై దాఖలైన పిటిషన్‌లో నోటీసులు
  • దోషులుగా తేలిన నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని పిటిషన్
  • క్రిమినల్ కేసులు ఉంటే ఉద్యోగంలో చేరేందుకు అనర్హులని పేర్కొన్న సుప్రీంకోర్టు
  • ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులు అవుతారని ప్రశ్న
ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ్ 2016లో దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది.

42 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లుగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటూ అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవన్నారు. నిందితులు ఏళ్లుగా విచారణకు రాకపోవడం, పదేపదే వాయిదాలు కోరుతుండటం జాప్యానికి మరో కారణమని నివేదికలో పొందుపరిచారు.

ఈ నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. క్రిమినల్ కేసులు ఉంటే ఉద్యోగంలో చేరేందుకు అనర్హులని, అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులు అవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, దానికి అనుగుణంగా ఉన్నత పరిష్కారం ఆలోచించాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అనంతరం కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను వాయిదా వేసింది.
Supreme Court
Election Commission
Central Government

More Telugu News