Kiran Royal: కిరణ్ రాయల్ ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని పవన్ కల్యాణ్ నిర్ణయం

Pawan Kalyan decides to set aside Kiran Royal from Janasena
  • తిరుపతి జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్ పై మహిళ తీవ్ర ఆరోపణలు
  • తనను మోసం చేశాడని సెల్ఫీ వీడియో
  • రూ.1.20 కోట్లు ఎగ్గొట్టాడని వెల్లడి
  • మహిళ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న జనసేన హైకమాండ్
తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్ పై తీవ్ర ఆరోపణలు రావడం తెలిసిందే. కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని, రూ.1.20 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టాడని లక్ష్మి అనే మహిళ ఆరోపించింది. తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని కోరితే తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ మహిళ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. 

తనకు అప్పులు ఇచ్చిన వాళ్లు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని, కిరణ్ రాయల్ ఆ డబ్బు ఇవ్వకపోతే తనకు చావు తప్ప మరో మార్గం లేదని ఆ మహిళ వాపోయింది. ఈ క్రమంలో, కిరణ్ రాయల్... సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఓ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ హైకమాండ్ స్పందించింది. ఆరోపణలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకునేంత వరకు తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్ ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. 

పార్టీ నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు జనసేన వ్యవహారాల్లో కిరణ్ రాయల్ జోక్యం చేసుకోరాదని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి, సమాజానికి ఉపయోగపడని వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలని జనసైనికులకు, వీరమహిళలకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని ఆ ప్రకటనలో వివరించారు. 

చట్టానికి ఎవరూ అతీతులు కారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.
Kiran Royal
Pawan Kalyan
Janasena
Tirupati

More Telugu News