Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందన

Union Home Minister Amit Shah responds on Chhattisgarh encounter
  • బీజాపూర్ లో కాల్పుల మోత
  • 31 మంది నక్సల్స్ మృతి... ఇద్దరు జవాన్ల మరణం
  • భద్రతా బలగాలకు ఇది అతి పెద్ద విజయం అంటూ అమిత్ షా ట్వీట్
మావోయిస్టులకు ఇవాళ అతి భారీ నష్టం జరిగింది. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 31 మంది నక్సల్స్ మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా మరణించారు. ఈ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. 

"భారత్ ను నక్సల్స్ రహిత దేశంగా మార్చే దిశగా భద్రతా బలగాలు బీజాపూర్ లో అతి పెద్ద విజయం సాధించాయి. ఈ ఆపరేషన్ లో 31 మంది నక్సలైట్లు మరణించారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి" అని అమిత్ షా సోషల్ మీడియాలో వివరించారు. 

ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందడంపై అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మానవ వ్యతిరేక నక్సలిజంను అంతమొందించడంలో ఇద్దరు ధైర్యశీలురైన జవాన్లను కోల్పోయాం అని తెలిపారు. ఇటువంటి అమరవీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. మరణించిన జవాన్లకుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అమిత్ షా వివరించారు. 

ఇక, 2026 మార్చి 31 లోపే దేశంలో నక్సలిజంను రూపుమాపుతామని పునరుద్ఘాటించారు. తద్వారా దేశంలో ఏ పౌరుడు నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోయేపరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. 

కాగా, ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.
Chhattisgarh Encounter
Amit Shah
Naxals
Maoist

More Telugu News