private hostels: మా కాలనీలో హాస్టళ్లు వద్దంటూ ఎస్సార్ నగర్ లో బ్యానర్లు

private hostels are not allowed in this colony in hyderabad
  • ఎస్సార్ నగర్ లో ఇబ్బడిముబ్బడిగా హాస్టళ్ల ఏర్పాటు
  • హాస్టళ్ల నిర్వహణతో కాలనీ వాసులకు ఇక్కట్లు
  • అనుమతులు లేని హాస్టళ్ల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న కాలనీ వాసులు
హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ ఈడబ్ల్యూఎస్ కాలనీలో హాస్టళ్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. కాలనీలో ఇటువంటి బ్యానర్లు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే.. ఇక్కడ గతంలో హౌసింగ్ బోర్డు నిర్మించిన ఇళ్లన్నీ దాదాపు వంద గజాలలోపే ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ రోడ్ల వెడల్పు కూడా తక్కువగా ఉండటంతో ఈ కాలనీ నివాసయోగ్యానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి వ్యాపార కార్యకలాపాలకు ఇది సాధ్యం కాదు.

అయితే, ఈ మధ్య కాలంలో కాలనీలో లెక్కకు మించి హాస్టల్స్ వెలుస్తుండటంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మౌలిక వసతులు కాలనీ వాసులకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయి. హాస్టల్స్ నిర్వహణతో ఒక్కో హాస్టల్ లో కనీసం 50 మందికి పైగా ఆశ్రయం పొందుతుండటంతో కాలనీలో సమస్యలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇరుకుగా ఉన్న హాస్టల్ గదులలో ఇమడలేక యువకులు అర్ధరాత్రి వరకు రోడ్లపైన కాలక్షేపం చేయడం, రహదారులపై పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తుండటం స్థానికులకు ఇబ్బందిగా మారుతోంది.

ఈ సమస్యలపై పలుమార్లు జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీస్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి స్పందన లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాలనీలో హాస్టళ్లు అనుమతించబడవంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పదికి పైగా హాస్టళ్లు కాలనీలో ఉండగా, మరికొన్ని ఈ తరహా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోందని కాలనీ వాసులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్న హాస్టల్ భవనాలపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ విషయంపై త్వరలో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను కలిసేందుకు కాలనీ వాసులు సిద్ధమవుతున్నారు. 
private hostels
Hyderabad
SR Nagar

More Telugu News