Arvind Kejriwal: ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన కేజ్రీవాల్

Kejriwal video message on AAP defeat in Delhi assembly elections
  • నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • పరాజయం దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ 
  • ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామన్న కేజ్రీవాల్
  • బీజేపీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని వెల్లడి 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అని ఈ ఉదయం వరకు ఎంతో ధీమాతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి దిమ్మదిరిగిపోయింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా... అత్యధిక స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఎన్నికల ఫలితాలు అధికార ఆప్ కు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి అగ్రనేతలు ఓటమిపాలయ్యారు. వారంతా బీజేపీ హవాలో కొట్టుకుపోయారు. 

ఈ ఘోర పరాజయంపై కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు. ప్రజల తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నామని, ప్రజా నిర్ణయాన్ని శిరసావహిస్తామని తెలిపారు. ఎన్నికల్లో విజయం అందుకున్న బీజేపీకి శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. 

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఫలితాలతో తన స్ఫూర్తి దెబ్బతింటుందని భావించడంలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పోరాడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కేజ్రీవాల్ వివరించారు. 

గత పదేళ్లలో ఢిల్లీలో తాగునీరు, విద్యుత్ సహా అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చామని వెల్లడించారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల వెంటే ఉంటామని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఓ వీడియో సందేశం వెలువరించారు.
Arvind Kejriwal
Delhi Assembly Elections
AAP
BJP
Delhi

More Telugu News