AP Cabinet: ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి

Minister Kolusu Parthasarathy told media AP Cabinet details
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ
  • సమావేశం వివరాలు మీడియాకు తెలిపిన మంత్రి పార్థసారథి
  • రిజిస్ట్రేషన్ల కోసం అడ్వాన్స్ టైమ్ స్లాట్
  • రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద డైనమిక్ క్యూ మేనేజ్ మెంట్ 
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు తెలిపారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్-2025కి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. గతంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఉండేదని, ఇప్పుడు కేంద్రం పాలసీలకు తగినట్టు ఏపీ రాజధాని అమరావతిలో అలాంటి సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ఎంఎస్ఎంఈ విధానంలో మార్పులకు ఆమోదం లభించిందని తెలిపారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఇండస్ట్రియలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదించినట్టు వివరించారు. 

"కోరమాండల్ సంస్థ కోరిన రాయితీ అంశానికి ఆమోదం తెలిపాం. తిరుమలలోని లడ్డూ తయారీ పోటులో 15 మంది సూపర్ వైజర్ల నియామకానికి ఆమోదం లభించింది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని రైతులకు పరిహారంపైనా నిర్ణయం తీసుకున్నాం. బాధిత రైతులకు ఎకరానికి రూ.8 లక్షలు ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయించింది. 

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల కోసం అడ్వాన్స్ టైమ్ స్లాట్ పెడుతున్నాం. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద డైనమిక్ క్యూ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేస్తాం. పేదలకు ఇళ్ల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించింది. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించాం. 

పోలవరం నిర్వాసితుల ఇళ్లు త్వరగా పూర్తిచేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ భారం ప్రజలపై పడకూడదని సీఎం చెప్పారు" అని మంత్రి పార్థసారథి వివరించారు.
AP Cabinet
Kolusu Parthasarathy
Andhra Pradesh

More Telugu News