BigBasket: మొన్న ఐఫోన్, నేడు శాంసంగ్.. బిగ్ బాస్కెట్ లో మొబైల్ ఫోన్ల డెలివరీ

BigBasket To Start 10 Minute Delivery Of Samsung Galaxy S25 Series Phones
  • ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో చేతికి అందిస్తామంటున్న బిగ్ బాస్కెట్
  • ఈ నెల 7 నుంచి శాంసంగ్ ఎస్ సిరీస్ స్మార్ట్ ఫోన్ల విక్రయం
  • గతేడాది సెప్టెంబర్ లో ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేసిన క్విక్ కామర్స్ సంస్థ
శాంసంగ్ కొత్త మోడల్ ఫోన్ల విక్రయాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో
డెలివరీ చేస్తామని బిగ్ బాస్కెట్ ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రమోషన్ ప్రోమోను సంస్థ రిలీజ్ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌25, గెలాక్సీ ఎస్‌25 ఆల్ట్రా మోడళ్లను బిగ్ బాస్కెట్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సహా ఇతరత్రా ఆన్ లైన్ పోర్టల్ మాదిరిగానే బిగ్ బాస్కెట్ లోనూ బ్యాంకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌25 ఫోన్‌ (12 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజీ) ధర రూ.80,990, గెలాక్సీ ఎస్‌25 అల్ట్రా ఫోన్‌ (12 జీబీ ర్యామ్‌ + 512 జీబీ స్టోరేజీ) ధర రూ.1,29,999 గా బిగ్ బాస్కెట్ ప్రమోషన్ టీజర్ లో పేర్కొంది. వీటిపై రూ.10 వేల వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది. దీనికితోడు బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పించనున్నట్లు బిగ్ బాస్కెట్ వర్గాలు తెలిపాయి. కాగా, గతేడాది సెప్టెంబర్ లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్ ఫోన్లను బిగ్ బాస్కెట్ విక్రయించింది. 

బెంగళూరు, ఢిల్లీ- ఎన్సీఆర్, ముంబై నగరాల్లో తమ సైట్ లో ఆర్డర్ చేసిన వినియోగదారుడికి నిమిషాల్లో ఫోన్ ను అందించింది. తాజాగా శాంసంగ్ ఫోన్లను కూడా ఈ మూడు నగరాల్లోనే విక్రయిస్తుందా లేక దేశవ్యాప్తంగా మిగతా ప్రధాన నగరాల్లో కూడా అందుబాటులో ఉంచుతుందా అనే విషయంపై బిగ్ బాస్కెట్ క్లారిటీ ఇవ్వలేదు.
BigBasket
Samsung
Delivery
Smart Phones
Galaxy S25

More Telugu News