Andre Russell: చ‌రిత్ర సృష్టించిన ఆండ్రీ రసెల్‌.. టీ20 క్రికెట్‌లో స‌రికొత్త రికార్డు!

Andre Russell Becomes Fastest to 9000 T20 Runs By Balls Faced
  • టీ20ల్లో అత్యంత వేగంగా 9వేల ర‌న్స్‌ పూర్తి చేసిన ఆట‌గాడిగా ర‌సెల్‌ రికార్డు
  • కేవ‌లం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్న క‌రేబియ‌న్ స్టార్‌
  • అంత‌కుముందు ఈ రికార్డు ఆసీస్ ప్లేయర్‌ మ్యాక్స్‌వెల్ (5,915) పేరిట 
  • ఓవ‌రాల్‌గా టీ20ల్లో 9వేల ప‌రుగులు పూర్తి చేసిన‌ 25వ ప్లేయ‌ర్ ర‌సెల్
వెస్టిండీస్ ప్లేయ‌ర్ ఆండ్రీ ర‌సెల్ టీ20ల్లో చ‌రిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 9వేల ప‌రుగులు పూర్తి చేసిన ఆట‌గాడిగా స‌రికొత్త రికార్డుకెక్కాడు. ర‌సెల్ కేవ‌లం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకోవ‌డం విశేషం. అంత‌కుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఆట‌గాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (5,915) పేరిట ఉండేది. 

ప్ర‌స్తుతం యూఏఈలో జ‌రుగుతున్న ఐఎల్‌టీ20 టోర్నీలో ఈ క‌రేబియ‌న్ ఆట‌గాడు ఆడుతున్నాడు. అబుదాబి నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శనివారం నాడు గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను న‌మోదు చేశాడు. వీరిద్ద‌రి త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన వారిలో ఏబీ డివిలియర్స్ (5,985 బంతులు), కీరన్ పొలార్డ్ (5,988 బంతులు), క్రిస్ గేల్ (6,007 బంతులు), అలెక్స్ హేల్స్ (6,175 బంతులు) ఉన్నారు.

రసెల్ టీ20 కెరీర్‌ గణాంకాలు ఇలా..
ఈ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్‌ మొత్తం 536 మ్యాచుల్లో 9,004 పరుగులు చేశాడు. ఓవ‌రాల్‌గా టీ20ల్లో 9వేల ప‌రుగులు పూర్తి చేసిన‌ 25వ ప్లేయ‌ర్ ర‌సెల్ కావ‌డం గ‌మ‌నార్హం. అతని 26.79 సగటు, 169.15 అద్భుత‌మైన‌ స్ట్రైక్ రేట్ తో ఈ జమైకన్ ఆల్ రౌండర్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 31 అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు సాధించాడు. ఇక‌ క్రిస్ గేల్ కేవలం 463 మ్యాచుల్లో 14,562 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అటు బౌలింగ్‌లోనూ ఆండ్రీ ర‌సెల్ అద్భుత‌మైన గ‌ణాంకాలు క‌లిగి ఉన్నాడు. అతను తన టీ20 కెరీర్‌లో 25.55 సగటు, 8.71 ఎకానమీతో 466 వికెట్లు తీశాడు.
Andre Russell
Team West Indies
T20 cricket
Cricket
Sports News

More Telugu News