Bathula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి... యూట్యూబ్ వీడియోలే గురువులు!

Police detained most wanted criminal Bathula Prabhakar in Hyderabad
  • గతరాత్రి ప్రిజమ్ పబ్ వద్ద కాల్పులు
  • ఘరానా నేరగాడు బత్తుల ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వివరాలు తెలిపిన డీసీపీ వినీత్
హైదరాబాద్ పోలీసులు గత రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద ఘరానా నేరస్తుడు బత్తుల ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పబ్ వద్దకు ప్రభాకర్ వచ్చాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులపై... ప్రభాకర్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి రెండు తుపాకులు, 23 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన డీసీపీ వినీత్ మీడియాకు వివరాలు తెలిపారు. 

బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినవాడు అని వెల్లడించారు. అతడిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 80 వరకు కేసులు ఉన్నాయని... పలు కేసుల్లో అతడు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ అతడు నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని డీసీపీ వివరించారు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడం ఎలా అనేది యూట్యూబ్ వీడియోలు చేసి నేర్చుకునేవాడని తెలిపారు. 

"ఇప్పటిదాకా బత్తుల ప్రభాకర్ 66 కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. 2022లో అనకాపల్లి కోర్టుకు తీసుకెళుతున్న సమయంలో తప్పించుకుని పారిపోయాడు. అప్పటినుంచి అతడు దొరకలేదు. గతరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద అతడ్ని పట్టుకున్నాం. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ పై కాల్పులు జరపడంతో, ఆ కానిస్టేబుల్ కాలికి గాయమైంది" అని డీసీపీ చెప్పారు.

ప్రభాకర్ ను అదుపులోకి తీసుకుని విచారించామని, అతడిచ్చిన సమాచారంతో అతడి నివాసంలో సోదాలు జరిపి 428 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గతంలో జైల్లో ఉన్న సమయంలో తనతో గొడవపడిన తోటి ఖైదీని చంపడానికి బత్తుల ప్రభాకర్ బీహార్ లో తుపాకీ కొనుగోలు చేశాడని డీసీపీ వినీత్ వెల్లడించారు. 

ఇక, నివాస గృహాల్లో దొంగతనాలు చేయడం వల్ల దొరికిపోయే అవకాశం ఉంటుందని భావించేవాడని... అందుకే ఊరి బయట ఉండే విద్యాసంస్థల్లో ఎక్కువగా చోరీలకు పాల్పడేవాడని వివరించారు. అతడు 2013 నుంచి నేరాల బాటపట్టాడని, చోరీకి వచ్చే ముందు తప్పనిసరిగా రెక్కీ చేసేవాడని తెలిపారు.
Bathula Prabhakar
Most Wanted
Police
Hyderabad

More Telugu News