Congo Clashes: కాంగోలో సైన్యానికి, రెబల్స్‌కు మధ్య భీకర యుద్ధం.. 773 మంది మృతి

773 dead in week long clashes as Congo
  • కాంగోలో దశాబ్దాలుగా ఘర్షణలు
  • తిరుగుబాటుదారుల వశమైన అతిపెద్ద నగరం గోమా
  • ఘర్షణల్లో 2,880 మందికి తీవ్ర గాయాలు
  • రెబల్స్ గ్రూప్ ‘ఎం23‘కి పొరుగునున్న రువాండా మద్దతు
  • రక్తపు ముద్దలు, చెత్తా చెదారంతో నిండిపోయిన గోమా వీధులు
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణలు కాంగోలో మరోమారు భీకర స్థాయికి చేరుకున్నాయి. కాంగో సైన్యం, రువాండా మద్దతు కలిగిన రెబల్స్ మధ్య వారం రోజులుగా జరుగుతున్న పోరులో 700 మందికిపైగా మృతి చెందారు. వందలాదిమంది గాయపడ్డారు. రెబల్స్ శక్తి ముందు సైన్యం సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో తూర్పు కాంగోలోని అతిపెద్ద నగరమైన గోమాను స్వాధీనం చేసుకున్న రెబల్స్.. మరిన్ని ప్రాంతాలను హస్తగతం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నారు. అయితే, వారి నుంచి సైన్యం కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. 

వారం రోజులుగా జరుగుతున్న పోరులో 773 మంది మృతి చెందగా, 2,880 మంది గాయపడినట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గోమా తిరుగుబాటు దారుల వశం కావడంతో ప్రజలు వేలాదిగా నగరాన్ని వదిలిపెడుతున్నారు. అయితే, విద్యుత్తు సరఫరాతోపాటు ప్రాథమిక సేవలను పునరుద్ధరిస్తామని తిరుగుబాటుదారులు హామీ ఇవ్వడంతో ప్రజలు తిరిగి గోమాకు చేరుకుంటున్నారు. చెత్తాచెదారం, రక్తం, దుర్వాసనతో నిండిపోయిన పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. తనకు ఇప్పుడు ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదని, ప్రతి మూలలో ఏదో ఒక దుఃఖం ఉందని పోరాటంలో మరణించిన వారి బంధువు ఒకరు తెలిపారు.  

కాంగోలోని తూర్పుపాంత్రం ఖనిజ సంపదతో నిండి ఉంది. ఇక్కడ విస్తారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. దీంతో ఆ ప్రాంతంపై నియంత్రణ కోసం 100 కంటే ఎక్కువ సాయుధ సమూహాలు పోటీపడుతున్నాయి. వాటిలో ‘ఎం23’ అనేది ఒకటి. దీనికి పొరుగున ఉన్న రువాండా మద్దతు ఇస్తోంది. దాదాపు 4 వేల మంది సైనికులు దానికి మద్దతుగా ఉన్నారు. 2012లో ‘ఎం23’ తొలిసారి గోమాను స్వాధీనం చేసుకుంది.  
Congo Clashes
Rebels
M23
Rwanda

More Telugu News