Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... థైరాయిడ్​ సమస్య కావొచ్చు!

thinning of hair weight gain hoarse voice signs hypothyroidism
  • ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న థైరాయిడ్ సమస్యలు
  • అందులోనూ హైపోథైరాయిడిజంతో అధిక శాతం మందికి ఇబ్బందులు
  • పెద్దవారిలోనే కాకుండా చిన్నవయసు వారిలోనూ కనిపిస్తున్న సమస్య
  • కొన్ని రకాల లక్షణాలతో సులువుగా గుర్తించవచ్చంటున్న నిపుణులు
కొన్నేళ్లుగా జీవన శైలిలో మార్పులు, తీవ్ర ఒత్తిడులు, ఆహార అలవాట్లు దెబ్బతినడం వంటివి థైరాయిడ్ సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా హైపో థైరాయిడిజం సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో కేవలం పెద్ద వయసువారికే వచ్చిన ఈ సమస్య ఇటీవలికాలంలో యుక్త వయసువారిలోనూ కనిపిస్తోందని వివరిస్తున్నారు. అయితే కొన్ని రకాల లక్షణాలను గమనించడం ద్వారా హైపో థైరాయిడిజం సమస్యను ముందే గుర్తించవచ్చని... తగిన చికిత్స ద్వారా బయటపడవచ్చని స్పష్టం చేస్తున్నారు.

థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయక...
మెడ మధ్యభాగంలో వాయునాళాన్ని చుట్టుకున్నట్టుగా ఉండే గ్రంథి థైరాయిడ్. మన శరీరంలో ఎన్నో రకాల విధులను నియంత్రించేందుకు ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్లే కీలకం. శరీరం శక్తిని సరిగా వినియోగించుకోవాలంటే కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా ఉండాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాంటి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే ‘హైపో థైరాయిడిజం’ సమస్య తలెత్తుతుందని వివరిస్తున్నారు.

గుండె వేగం తగ్గడం... వెంట్రుకలు సన్నబడటం
  • హైపో థైరాయిడిజం సమస్య ఉన్నవారిలో వెంట్రుకలు బాగా సన్నబడిపోతాయి. సులువుగా తెగిపోతుంటాయి.
  • ఈ సమస్య మొదలైనవారి జీవన శైలిలో, ఆహారంలో పెద్దగా మార్పులేమీ లేకున్నా కూడా... ఉన్నట్టుండి బరువు పెరగడం ప్రారంభమవుతుంది.
  • వీరిలో గొంతు బొంగురుగా మారిపోతుంటుంది. మాట్లాడటానికి పెద్దగా ఇబ్బంది లేకున్నా... అదో రకంగా ధ్వని వినిపిస్తుంది.
  • హైపో థైరాయిడిజం ఉన్నవారిలో... పెద్దగా కారణమేదీ లేకుండానే, విశ్రాంతి తీసుకున్నా కూడా తీవ్ర నీరసంగా ఉండటం, గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
  • శరీరం బలహీనంగా మారడమే కాదు... కండరాల్లో తరచూ నొప్పిగా అనిపిస్తుంటుంది.
  • వెంట్రుకలు పొడిగా అయి, పెళుసుబారుతాయి. జుట్టు రాలిపోయే సమస్య పెరుగుతుంది. కనుబొమ్మల వెంట్రుకలు కూడా సన్నబడిపోతాయి.
  • ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో వినికిడి శక్తి మందగిస్తుంది.
  • మతిమరపు, దేనిపైనా పూర్తిగా ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
  • హైపో థైరాయిడిజం సమస్య మొదలైనవారిలో గొంతు మారిపోతుంది, బొంగురుగా మారుతుంది. సమస్య పెరిగినకొద్దీ మరింతగా ముదురుతుంది.
  • ఈ సమస్యతో చర్మం ఎండిపోవడం, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరగడం, చలిని ఏ మాత్రం తట్టుకోలేకపోవడం, మహిళల్లో రుతుక్రమంలో ఇబ్బందులు వంటి సమస్యలెన్నో తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ అంశాలు గుర్తుంచుకోండి
పైన చెప్పిన లక్షణాలు ఒక్క హైపో థైరాయిడిజంతో మాత్రమేగాక ఇతర అనారోగ్యాలు, వ్యాధుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ లక్షణాలు కనిపించగానే ‘హైపో థైరాయిడిజం’ బారినపడినట్టుగా భావించవద్దని... వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
Health
thyroid
hypothyroidism
offbeat
science

More Telugu News