Nara Lokesh: 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం... అన్ని సేవలు వాట్సాప్ లోనే లభ్యం!

Nara Lokesh launches Mana Mitra Whatsapp governance
  • తొలి విడతలో 161 రకాల సేవలు లభ్యం
  • ప్రతి సమాచారం వాట్సాప్ లోనే లభ్యం
  • వాట్సాప్ ద్వారానే సర్టిఫికెట్లు పొందే అవకాశం
'మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం' పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్ ప్రారంభించారు. పౌర సేవలను అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం, వారికి అవసరమైన సమాచాన్ని అందించడం, వారికి అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేయడం వంటి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతాయి. దీనికోసం వాట్సాప్ నంబర్ 95523 00009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 

మన మిత్ర ద్వారా తొలి విడతలో 161 రకాల సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. తొలి విడతలో ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇంధన, దేవాదాయ తదితర శాఖల్లో సేవలు అందుతాయి. సర్టిఫికెట్లు, పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండదు. 

వాట్సాప్ ద్వారా ఏ సమాచారాన్నయినా సందేశాల ద్వారా ప్రజలకు పంపిస్తారు. వర్షాలు, వరదలు, విద్యుత్తు, వైద్యారోగ్యం, సబ్ స్టేషన్ల మరమ్మతులు, పర్యాటకం, మౌలిక వసతులు తదితర సమాచారం అందిస్తారు. వివిధ శాఖలకు సంబంధించిన పలు సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ట్రేడ్ లైసెన్సులు, ల్యాండ్ రికార్డుల వంటి సర్టిఫికెట్లు పొందవచ్చు. ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు వంటివి వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు.  

వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకునే వారు.... వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేస్తే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ టైప్ చేసి... వినతి ఏమిటో టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నంబర్ ద్వారా వినతి పరిష్కారం ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు.
Nara Lokesh
Telugudesam
Mana Mitra

More Telugu News