Suryapet District: సూర్యాపేట పరువు హత్య కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్

Police arrested six accused in Surypet murder case
  • ఆరు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న కృష్ణ, భార్గవి
  • ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు కృష్ణపై కక్ష కట్టిన భార్గవి సోదరులు
  • హత్య చేసి పిల్లలమర్రి మూసీ కాల్వకట్టపై పడేసిన నిందితులు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పరువు హత్య కేసులో పోలీసులు ఈరోజు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో భార్గవి ఇద్దరు సోదరులు నవీన్, వంశీ, నానమ్మ బుచ్చమ్మ, తండ్రి సైదులు ఉన్నారు. నవీన్ స్నేహితులు బైరి మహేశ్, సాయిచరణ్‌లను అరెస్ట్ చేశారు. ఆరు నెలల క్రితం వడ్లకొండ కృష్ణ, భార్గవి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు కక్ష పెంచుకున్న సోదరులు కృష్ణను హత్య చేశారు. సోమవారం నాడు పిల్లలమర్రి కాల్వకట్టపై మృతదేహం లభ్యమైంది.

కృష్ణను చంపుతామని భార్గవి సోదరుడు నవీన్ పలుమార్లు బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. కృష్ణను హత్య చేసేందుకు భార్గవి కుటుంబ సభ్యులు నలుగురితో పాటు మరో ఇద్దరు కుట్రపన్నారు. రెండు నెలలుగా కృష్ణను హత్య చేసేందుకు పథకం వేశారు. ఈ నెల 19న హత్య చేయాలని భావించినప్పటికీ అది కుదరలేదు. దీంతో ఆదివారం హత్య చేశారు.

సూర్యాపేటలోని జనగామ క్రాస్ రోడ్‌లోని ఓ నిందితుడి వ్యవసాయ భూమి వద్ద ఆదివారం రాత్రి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని తెల్లవారుజాము వరకు కారులో తిరిగారు. చివరకు పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాల్వకట్టపై మృతదేహాన్ని వదిలేసి నిందితులు పరారయ్యారు.
Suryapet District
Telangana

More Telugu News