Anil ravipudi: ఎనిమిది హిట్లు వచ్చినా వాళ్లు నాకు రెస్పెక్ట్‌ ఇవ్వడం లేదు: అనిల్‌ రావిపూడి

They are not giving me respect even after eight hits Anil Ravipudi
  • సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న అనిల్‌ 
  • తనకు ఇవ్వాల్సినంత రెస్పెక్ట్‌ ఇవ్వడం లేదని వ్యాఖ్యానించిన దర్శకుడు 
  • ఆడియన్స్‌ ప్రేమ తనకు ముఖ్యమని చెబుతున్న అనిల్‌ రావిపూడి  
'పటాస్‌' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనిల్‌ రావిపూడి ఆ తరువాత సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌-2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్‌-3,  భగవంత్‌ కేసరి వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. వినోదమే ప్రధానంగా సినిమాలు తెరకెక్కిస్తూ దర్శకుడిగా అనిల్‌ తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ముఖ్యంగా, వెంకటేష్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం వెంకటేష్‌ కెరీర్‌తో పాటు అనిల్ కెరీర్‌లో కూడా బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌గా నిలిచింది. 

అయితే, ఈ జనవరితో తను సినీ పరిశ్రమలోకి దర్శకుడిగా ప్రవేశించి పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ పది సంవత్సరాల్లో ఎనిమిది విజయాలు అందుకుని సక్సెస్‌ఫుల్‌ దర్శకుడిగా అనిల్‌ పేరు పొందాడు. అయితే తనకు ఇన్ని విజయాలు దక్కినా... తెలుగు సినీ పరిశ్రమతో పాటు మీడియాలో, క్రిటిక్స్‌ వద్ద తనకు రావాల్సినంత రెస్పెక్ట్‌ రావటం లేదని ఈ యువ దర్శకుడు అసంతృప్తితో ఉన్నాడు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయన చాలా ఆవేదనతో సమాధానమిచ్చాడు. 

'' ఇన్నివిజయాలు సాధించినా నాకు సినీ పరిశ్రమలో, మీడియాలో, క్రిటిక్స్‌ వర్గాల్లో రావాల్సినంత రెస్పెక్ట్‌ దక్కడం లేదనే విషయంలో నిజం ఉంది. అది ఎందుకో నాకు తెలియదు. నేను ఈ విషయంలో పెద్దగా ఆలోచించడం లేదు కానీ, నేను ఆడియన్స్‌ మధ్యకు వెళ్లినప్పుడు వాళ్ల దగ్గర నాకు లభించే ప్రేమ, అభిమానం విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. అది నాకు చాలు. క్రిటిక్స్ సినిమా చూసే విధానం వేరుగా ఉంటుంది. వాళ్లకు నచ్చే సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో వాళ్ల తప్పేమీ లేదు. ఎవరి ఐడియాలాజీ వారికి ఉంటుంది. నా సినిమాలు అందరికి నచ్చాలని రూలేమీ లేదు. పర్టిక్యులర్‌గా సోషల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో కొంత మంది దర్శకులకు చిన్న విషయానికే పెద్ద ఎలివేషన్‌ వస్తుంది. 


అలా వాటిని క్రియేట్‌ చేసుకునే దర్శకులు ఉన్నారు. అది వాళ్లకు చెల్లుబాటు అవుతుంది. కానీ ఫైనల్‌గా ఎవరికైనా కావాల్సింది ఆడియన్స్‌కు సినిమా నచ్చడం, ప్రేక్షకులు టిక్కెట్లు కొనుక్కొని సినిమా చూడటం. మై గేమ్‌ ఈజ్‌ క్లియర్‌, మై ఎయిమ్‌ ఈజ్‌ క్లియర్‌. నా సినిమాను ఆడియన్స్‌ ప్రేమిస్తున్నారు. వాళ్లకు నా సినిమా నచ్చుతుంది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విజయంతో ప్రేక్షకులు మరోసారి ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పారు. సో... నేను వాళ్ల ప్రేమను పొందాను చాలు. వాళ్లిచ్చే ధైర్యం నాకు కొండంత బలం. 

భవిష్యత్‌లో మరిన్ని సూపర్‌హిట్‌లు ఇస్తాను. చూద్దాం, అప్పుడైనా వాళ్లు యాక్సెప్ట్‌ చేస్తారని అనుకుంటున్నాను. కానీ నేను మాత్రం మంచి సినిమాలు, హిట్‌ సినిమాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఇక, ఇంతకు ముందుతో పోల్చుకుంటే నాపై ఉంటే చులకన భావం కాస్త తగ్గిందనే చెప్పాలి. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఆ ఫీలింగ్‌ ఇంకా బాగా తగ్గిందని అనిపిస్తుంది. తగ్గకపోయినా చేసేదేమీ లేదు. నా పని నేను నిజాయతీగా చేసుకుంటూ పోవడమే'' అన్నారు 


Anil ravipudi
Sankranthiki Vasthunam
Anil ravipudi interview
Anil ravipudi lateest news
tollywood
Anil ravipudi comments

More Telugu News