Telangana: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాపై సీఎం సమీక్ష

CM Revanth Reddy review on Indiramma Houses
  • ఇసుక సరఫరా, గనుల శాఖపై సీఎం సమీక్ష
  • ఇసుకను ఎలా సరఫరా చేయాలనే అంశంపై అధ్యయన కమిటీ ఏర్పాటు
  • వారం లోగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని ఆదేశం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఎలా సరఫరా చేయాలనే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇసుకను ఎలా సరఫరా చేయాలనే అంశంపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు.

అధ్యయన కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌ను నియమించారు. వారం లోగా అధ్యయనం చేసి సమగ్ర విధానాలతో నివేదికను రూపొందించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నిర్మాణాలు పెరుగుతున్నప్పటికీ ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకు ఇసుకను కొనుగోలు చేస్తున్నారని సీఎం అన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందేలా చూడాలని, అలాగే ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
Telangana
Sand
Congress

More Telugu News