Gurumurthy Arrest: భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ

Rachakonda CP Sudheer Babu press meet over brutal murderer Gurumurthy
  • మీర్ పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తి అరెస్ట్
  • ఆధారాలు సేకరించిన పోలీసులు
  • మీడియా సమావేశం నిర్వహించిన రాచకొండ సీపీ 
హైదరాబాద్ మీర్ పేటలో భార్యను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. భార్య వెంకట మాధవి (35)ని గురుమూర్తి అత్యంత క్రూరంగా చంపాడని సీపీ వెల్లడించారు. భార్యను చంపినందుకు అతడిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదని అన్నారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైరయ్యాడని తెలిపారు. దర్యాప్తులో అతడు చెబుతున్న విషయాలు విని తాము నివ్వెరపోయామని చెప్పారు. 

"సంక్రాంతి పండుగ సమయంలో గురుమూర్తి, వెంకట మాధవి దంపతులు వారి పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. పిల్లలను అక్కడే ఉంచి భార్యతో కలిసి ఇంటికి తిరిగొచ్చాడు. పిల్లల ఎదురుగా భార్యపై దాడి చేస్తే అందరికీ తెలుస్తుందని, పిల్లలను చుట్టాల ఇంటి వద్దే ఉంచాడు. మొదట భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె తలను గోడకేసి బలంగా కొట్టాడు. దాంతో ఆమె తలకు దెబ్బ తగిలి కిందపడిపోయింది. ఆమె మీద కూర్చుని గొంతు నులిమి చంపేశాడు. 

ఆ తర్వాత ఇంట్లో ఉన్న కత్తితో మొదట కాళ్లు కట్ చేశాడు, ఆ తర్వాత చేతులు, ఇతర అవయవాలు, తల కట్ చేశాడు. వాటిని నీళ్లలో వేసి హీటర్ సాయంతో ఉడికించాడు. ఓ వ్యక్తి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తాడో మాకు అర్థం కాలేదు. ఉడికించిన అవయవాలను స్టవ్ పై కాల్చాడు. ఎముకలు కాలేదాకా వేడి చేసి వాటిని పొడి చేశాడు. ఆ రోజు సాయంత్రం వాటిని ఓ పెయింట్ బకెట్ లో వేసుకుని జిల్లెలగూడ చెరువులో కలిపేశాడు. ఇంటికి వచ్చి కొంత మేర క్లీన్ చేశాడు. 

బంధువుల ఇంటికి వెళ్లి పిల్లలను తీసుకువచ్చాడు. అమ్మ ఏదని పిల్లలు అడిగితే... బయటికి వెళ్లిందని చెప్పాడు. అయితే హత్య చేసిన బెడ్రూం వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడ్డాడు. ఇలా రెండ్రోజులు జరిగింది. ఆ తర్వాత వెంకట మాధవి తల్లిదండ్రులు వచ్చి అడిగారు. చివరికి వాళ్ల అమ్మ వచ్చి మిస్సింగ్ కంప్లెయింట్ చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశాం. 

ఈ హత్య కేసులో ఆధారాలు సేకరించేందుకు తీవ్రంగా శ్రమించాం. హత్య చేసిన వాళ్లు ఎక్కడో చిన్న తప్పు చేసి దొరికిపోతారని మాకు ట్రైనింగ్ లో నేర్పించారు. ఈ కేసులో కూడా గురుమూర్తి అలాగే దొరికిపోయాడు. అతడు హత్య చేసిన విధానం ఎంత దారుణంగా ఉందంటే... మేం పోలీసులం సరిగా వివరించలేకపోవచ్చు కానీ, మీరు జర్నలిస్టులు సరిగ్గా వివరించగలరు. విచారణలో పోలీసులను తప్పుదారి పట్టించేందుకు అనేక అబద్ధాలు చెప్పాడు" అని సీపీ సుధీర్ బాబు వివరించారు.
Gurumurthy Arrest
Murder
Wife
Rachakonda CP
Hyderabad

More Telugu News