IND vs ENG: భార‌త్‌తో మూడో టీ20.. ఇంగ్లండ్ జ‌ట్టు ఇదే

England Announce Playing 11 for IND vs ENG 2025 3rd T20I
  • ఈరోజు రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య‌ మూడో టీ20
  • రెండో టీ20లో ఆడిన జ‌ట్టునే ఈ మ్యాచ్ కు కొన‌సాగిస్తున్న ఇంగ్లండ్‌
  • ఇప్ప‌టికే రెండు మ్యాచ్‌ల‌లో విజ‌యంతో 2-0తో ముందంజ‌లో టీమిండియా
  • ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ భార‌త్ వ‌శం
రాజ్‌కోట్ వేదిక‌గా ఈరోజు టీమిండియాతో జ‌రిగే మూడో టీ20 కోసం ఇంగ్లండ్ త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. రెండో టీ20లో ఆడిన జ‌ట్టునే ఈ మ్యాచ్ కు కూడా కొన‌సాగిస్తోంది. ఈరోజు రాత్రి 7 గంట‌ల‌కు రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 

ఇక రెండో టీ20లో ఇంగ్లీష్ జ‌ట్టు రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. బ్రైడ‌న్ కార్స్‌, జేమీ స్మిత్ ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లో అరంగేట్రం చేశారు. కార్స్ ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. 17 బంతుల్లో 31 ర‌న్స్ బాదిన అత‌డు.. బౌలింగ్‌లో మూడు వికెట్లు కూడా ప‌డ‌గొట్టాడు. అటు స్మిత్ కూడా 12 బంతుల్లో 22 ప‌రుగులు చేసి ప‌ర్వాలేద‌నిపించాడు. వీరిద్ద‌రూ గాస్ అట్కిన్స‌న్‌, జాక‌బ్ బెథెల్ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చారు. 

"మేము సిరీస్‌లో వెన‌క‌బ‌డ్డాం. క‌నుక తిరిగి పుంజుకోవాల‌ని భావిస్తున్నాం. అందుకే రెండో టీ20లో మంచి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న జ‌ట్టునే మూడో టీ20కి కూడా కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించాం" అని ఇంగ్లండ్‌ క్రికెట్ మూడో టీ20 కోసం 'ప్లేయింగ్ ఎలెవన్‌'ను ప్ర‌క‌టించిన త‌మ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

అటు ఆ జ‌ట్టు కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ కూడా త‌మ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల హ‌ర్షం వ్యక్తం చేశాడు. రెండో టీ20లో విజ‌యానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చామ‌ని, అయితే త‌మ నుంచి తిల‌క్ వ‌ర్మ మ్యాచ్‌ను లాగేసుకున్నాడ‌ని చెప్పుకొచ్చాడు. అరంగేట్ర‌ ఆట‌గాళ్లు బ్రైడ‌న్ కార్స్‌, జేమీ స్మిత్ తొలి మ్యాచ్‌లోనే మంచి ఆట‌తో ఆక‌ట్టుకోవ‌డం బాగుంద‌న్నాడు. మూడో టీ20లో టీమిండియాను ఓడించి, సిరీస్‌లో తిరిగి పుంజుకుంటామ‌ని బ‌ట్ల‌ర్ ఆశాభావం వ్య‌క్తం చేశాడు. 

ఇక ఐదు మ్యాచుల సిరీస్‌లో ఆతిథ్య భార‌త్ ఇప్ప‌టికే రెండు మ్యాచ్‌ల‌లో విజ‌యంతో 2-0తో ముందంజ‌లో ఉంది. ఈరోజు జ‌రిగే మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవ‌సం చేసుకోవాల‌ని చూస్తోంది. మొద‌టి మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ (79), రెండో మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ (72) టీమిండియాకు ఒంటి చేత్తో విజ‌యాల‌ను అందించారు.   
IND vs ENG
England
Team India
3rd T20I
Cricket
Sports News

More Telugu News