Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ల అమ్మకాలు రేపటి నుంచే!

Ticket sales of ICC Champions Trophy will kick off from tomorrow
  • ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ
  • పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా భారీ టోర్నమెంట్
  • 1996 తర్వాత తొలిసారి గ్లోబల్ టోర్నీకి పాక్ ఆతిథ్యం
మరి కొన్ని రోజుల్లో భారీ క్రికెట్ సంబరానికి తెర లేవనుంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఫిబ్రవరి 19న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో జరిగే మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు రేపు (జనవరి 28) ప్రారంభం కానున్నాయి. టికెట్లు ఆన్ లైన్ లోనూ, పాకిస్థాన్ లోని 100 అవుట్ లెట్లలోనూ అందుబాటులో ఉంటాయి. 

8 అగ్రశ్రేణి జట్లు పాల్గొనే ఈ భారీ ఈవెంట్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే, పాకిస్థాన్ లో తాము మ్యాచ్ లు ఆడబోమని భారత్ తెగేసి చెప్పడంతో, హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహిస్తున్నారు. టీమిండియా ఆడే మ్యాచ్ లకు దుబాయ్ వేదికగా నిలుస్తుంది. 

ఇక, పాకిస్థాన్ లో కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు జరగనున్నాయి. రెండో సెమీఫైనల్ సహా పాకిస్థాన్ లో జరిగే 10 మ్యాచ్ లకు రేపటి నుంచి టికెట్ల విక్రయాలు జరగనున్నాయి. టీమిండియా ఆడే మ్యాచ్ ల టికెట్ల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. 

1996లో వరల్డ్ కప్ నిర్వహించాక పాకిస్థాన్ లో జరుగుతున్న మరో గ్లోబల్ టోర్నమెంట్ ఇదే. దాంతో పాక్ లో క్రికెట్ మేనియా ఓ భారీ స్థాయిలో నెలకొంది. 

ఈ టోర్నీలో ఆతిథ్య పాకిస్థాన్, టీమిండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్-బీలో ఉన్నాయి. ప్రతి గ్రూప్ లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్స్ కు చేరుకుంటాయి. మార్చి 9న దుబాయ్ లో ఫైనల్ జరగనుంది.
Champions Trophy 2025
Tickets
Sales
ICC
Pakistan
Dubai

More Telugu News