Jeet Adani Wedding: గౌతమ్ అదానీ ఇంట పెళ్లి బాజాలు... ఫిబ్రవరి 7న జీత్ అదానీ వివాహం

Gautam Adanis  younger son Jeet Adani set to marry on Feb 7
  • త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న అదానీ చిన్నకుమారుడు
  • దివా జైమిన్ షాతో జీత్ అదానీ వివాహం
  • హాజరుకానున్న ప్రపంచ ప్రముఖులు
  • బ్రిటన్ రాజు చార్లెస్, పోప్ ఫ్రాన్సిస్ కూడా వస్తారని ప్రచారం
భారత కుబేరుడు గౌతమ్ అదానీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం దివా జైమిన్ షాతో ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా జరగనుంది. జనవరి 21న గౌతమ్ అదానీ కుటుంబం ప్రయాగ్ రాజ్ లో కుంభమేళాకు హాజరైన సమయంలో... అక్కడి వేదపండితుల సమక్షంలో జీత్ అదానీ పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు.

జీత్ అదానీ వయసు 27 సంవత్సరాలు. అతడు ప్రస్తుతం అదానీ ఎయిర్ పోర్ట్స్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థ భారత్ లో ఆరు ఎయిర్ పోర్టులను నిర్వహిస్తోంది. జీత్ అదానీ అమెరికాలోని ప్రఖ్యాత పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ లో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. 2019లో అదానీ గ్రూప్ లో కాలుమోపాడు. జీత్ అదానీ అన్న కరణ్ అదానీ అదానీ పోర్ట్స్ కార్యకలాపాలు చూసుకుంటున్నాడు. కరణ్ అదానీకి పరిధితో వివాహం జరిగింది.

జీత్ అదానీ చేయందుకోబోతున్న అమ్మాయి దివా జైమిన్ షా వజ్రాల వ్యాపారి జైమిన్ షా ముద్దుల కుమార్తె. వజ్రాల వ్యాపారంలో జైమిన్ షా అంతర్జాతీయంగా ఎంతో ప్రముఖ స్థానంలో ఉన్నారు. 

ఇక, అదానీ వంటి అపర సంపన్నుడి ఇంట జరుగుతున్న శుభకార్యం కావడంతో... ప్రపంచ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతారని తెలుస్తోంది. అతిథుల జాబితాలో ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, హాలీవుడ్ స్టార్ డేనియల్ క్రెగ్, పాప్ సింగర్లు టేలర్ స్విఫ్ట్, కోల్డ్ ప్లే, బిల్లీ ఐలిష్, జస్టిన్ బీబర్, అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్, కర్డాషియన్ సిస్టర్స్, రఫెల్ నడాల్, దిల్జీత్ దోసాంజ్ వంటి ప్రముఖులు ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. అంతేకాదు, బ్రిటన్ రాజు చార్లెస్, పోప్ ఫ్రాన్సిస్ కూడా జీత్ అదానీ వివాహ కార్యక్రమానికి హాజరవుతారని ప్రచారం జరుగుతోంది.

కాగా, జీత్ అదానీదివా జైమిన్ షా వివాహం ఫిబ్రవరి 7న అహ్మదాబాద్ లో జరగనుంది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు ఫిబ్రవరి 5న తెరలేవనుంది. ఈ పెళ్లికి 300 మంది అతిథులు మాత్రమే వస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆ సంఖ్యపై స్పష్టత లేదు.
Jeet Adani Wedding
Gautam Adani
Diva Jaimin Shah
Celebrity Marriage

More Telugu News