UK: 2500 కోట్ల ఆస్తికి వారసుడు.. హత్య కేసులో జైలుకు.. యూకేలో ఘటన

UK heir to over 200 million dollor fortune gets life imprisonment in murder case
  • 19 ఏళ్లు శిక్ష అనుభవించాకే పెరోల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం
  • బాల్య మిత్రుడిని 40 సార్లు పొడిచి చంపిన డైలాన్ థామస్
  • 2023 డిసెంబర్ లో హత్య.. తాజాగా తీర్పు వెలువరించిన వేల్స్ కోర్టు
వేల కోట్ల విలువైన ఆస్తికి వారసుడు.. అయితేనేం హత్య కేసులో జైలు పాలయ్యాడు. ఇరవై నాలుగేళ్ల ఆ యువకుడు ఇక జీవితాంతం జైలులోనే గడపాల్సి ఉంటుంది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా కనీసం 19 ఏళ్లు జైలులో గడిపాకే వీలుంటుంది. యూకేలోని వేల్స్‌కు చెందిన ఓ యువకుడికి అక్కడి కోర్టు విధించిన శిక్ష ఇది. 2023 డిసెంబరులో హత్య జరగగా విచారణ జరిపిన కోర్టు తాజాగా శిక్ష విధించింది. యూకేలో ప్రసిద్ధి పొందిన పీటర్ పై కంపెనీ స్థాపకుడు స్టేన్లీ థామస్ మనవడు డైలాన్ థామస్ ఈ కేసులో జైలుపాలయ్యాడు. పీటర్ పై కంపెనీ ప్రస్తుతం 2500 కోట్ల విలువ చేస్తుందని, ఆ కంపెనీకి డైలాన్ థామసే వారసుడని యూకే మీడియా కథనాలు ప్రచురించాయి.

ఏం జరిగిందంటే..
డైలాన్ థామస్ తన చిన్ననాటి స్నేహితుడు విలియం బుష్‌తో కలిసి లాండాఫ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉండేవాడు. 2023 డిసెంబరులో ప్రజలంతా క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతుండగా డైలాన్ మాత్రం తన నానమ్మ ఇంటికి వెళ్లాడు. ఆ మరుసటి రోజు తనను లాండాఫ్‌లో దింపేయాలని నానమ్మను కోరగా.. ఆవిడ తన కారులో డైలాన్‌ను తీసుకుని బయలుదేరింది. దారిలో తన స్నేహితుడు బుష్‌కు మెసేజ్ చేసి, అపార్ట్‌మెంట్‌లో ఉన్నాడని నిర్ధారించుకున్నాడు. కారు లాండాఫ్‌లోని అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకోగానే నానమ్మను కాసేపు వేచి ఉండమని చెప్పిన డైలాన్.. రహస్యంగా తన ఫ్లాట్‌లోకి వెళ్లాడు. కూరగాయలు కోసే కత్తితో బుష్‌పై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు.

దీంతో బుష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆపై తనను తాను పొడుచుకున్న డైలాన్.. నానమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి బుష్ తనపై దాడి చేశాడని చెప్పాడు. తర్వాత పోలీసుల వద్ద కూడా అదే కథ వినిపించాడు. అయితే, విచారణలో అసలు విషయం బయటపడటంతో పోలీసులు డైలాన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. హత్యకు కొన్ని నెలల ముందు నుంచీ డైలాన్ సైకోలా ప్రవర్తించాడని అంటున్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత డైలాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. కేసు తీవ్రత దృష్ట్యా డైలాన్‌కు జీవిత ఖైదు విధించింది. అదే సమయంలో కనీసం 19 ఏళ్లు శిక్ష అనుభవించిన తర్వాతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అర్హత కలుగుతుందని పేర్కొంది.
UK
2500 Crores
Murder Case
Life Imprisonment

More Telugu News