Nara Lokesh: సాక్షిపై పరువునష్టం కేసు.. రేపు మంత్రి నారా లోకేశ్ క్రాస్ ఎగ్జామినేషన్

Minister Nara Lokesh To Vishaka Court For Cross Examination In Defamation Case On Sakshi Paper
  • విశాఖపట్నంలోని 12వ అదనపు జిల్లా కోర్టులో విచారణ
  • సాక్షిలో అస‌త్య క‌థ‌నంపై మంత్రి న్యాయపోరాటం
  • ఇప్పటికే రెండుసార్లు క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు
సాక్షి దినపత్రికపై దాఖలు చేసిన ప‌రువున‌ష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ సోమవారం విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఇప్పటికే రెండు క్రాస్ ఎగ్జామినేషన్స్ పూర్తయ్యాయి. మూడోసారి జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి హాజరవుతున్నారు. సాక్షి దినపత్రిక తరఫున మొత్తం ఐదుగురు లాయర్లు వాదిస్తుండగా, మొదటి న్యాయవాది ప్రస్తుతం క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఈ కేసులో మంత్రి లోకేశ్ తరపున గుంటూరు సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు హాజరవుతున్నారు.

ఇదీ కేసు..
2019 అక్టోబర్ 22న `చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి` హెడ్డింగ్‌తో అస‌త్యాలు, క‌ల్పితాల‌తో సాక్షి దినప‌త్రిక‌లో ఓ కథనం ప్ర‌చురించారు. ఈ కథనం పూర్తిగా అవాస్త‌వాలతో కూడినదని, ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న‌ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే దీనిని ప్రచురించారని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆరోపించారు. దీనిపై సాక్షి పత్రికకు రిజిస్టర్ నోటీసు పంపించినా ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వకపోవడం, నోటీసుల‌కు స్పందించ‌క‌పోవ‌డంతో నారా లోకేశ్ పరువునష్టం దావా వేశారు. ఆ కథనంలో పేర్కొన్న రోజులలో తాను విశాఖ‌లోనే లేనని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన మర్యాదల ఖ‌ర్చును త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ప్ర‌తిష్ట‌ని మంట‌గ‌లిపేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఆరోపించారు. గతంలో మంత్రిగా తాను అనేకమార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు స్వీకరించలేదని లోకేశ్ స్ప‌ష్టం చేశారు.
Nara Lokesh
Vishaka Court
Defamation Case
Sakshi
Andhra Pradesh

More Telugu News