Putin: నిజమే.. ట్రంప్ అప్పట్లో గెలిచి ఉంటే యుద్ధం వచ్చేదే కాదు: పుతిన్

Ukraine Crisis Might Not Have Happened Were Trump President says Putin
  • అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకు వంతపాడిన రష్యా ప్రెసిడెంట్
  • ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి
  • ట్రంప్ పై ప్రశంసలు కురిపించిన వ్లాదిమిర్ పుతిన్
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు నిజమేనని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఒకవేళ 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి ఉంటే ఈ యుద్ధం జరిగేదే కాదని చెప్పారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా ట్రంప్ అడ్డుపడేవారని తెలిపారు. ట్రంప్ చురుకైన వ్యక్తి అని, చెప్పింది చేసి చూపించే నేత అని కొనియాడారు. ఈమేరకు రష్యా టెలివిజన్‌లో మాట్లాడుతూ పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాగా, ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై ఎప్పుడు స్పందించినా ట్రంప్ ఒకమాట చెబుతూ వస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో కనుక తాను గెలిచి ఉంటే రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరగనిచ్చే వాడిని కాదని చెబుతున్నారు. తాజాగా పుతిన్ ఈ విషయం నిజమేనని, ట్రంప్ అందుకు సమర్థుడని ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో పొడసూపిన విభేదాలపై సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే, ట్రంప్ తో చర్చలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై పుతిన్ స్పందించలేదు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి చర్చలకు ఆహ్వానం కోసం పుతిన్ ఎదురుచూస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Putin
Trump
Russia
Ukraine
War

More Telugu News