Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. వీడియో ఇదిగో!

Villagers Attack On MLA Padi Koushik Reddy In Kamalapur Village
  • కుర్చీలతో దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు
  • కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు, కోడి గుడ్లతో దాడి జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలో శుక్రవారం ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. కమలాపూర్ లో ప్రభుత్వ అధికారులు శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు సహా నాలుగు పథకాలకు అర్హుల జాబితాను వెల్లడించారు. ఈ క్రమంలోనే అర్హుల జాబితా చదువుతూ స్థానిక మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తౌటం ఝాన్సీరాణి గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని గత ప్రభుత్వం జనాలను మోసం చేసిందని, కట్టిన ఇళ్లను కూడా లబ్దిదారులకు అందించలేదని ఆరోపించారు. దీంతో అదే వేదికపై ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుతగిలారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సభను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్దిదారుల పేర్లను చదవకుండా అడ్డుకోవడమేంటని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అనుచరులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలుచున్నారు.

అదేసమయంలో ఎమ్మెల్యే అనుచరులు గ్రామస్థులపై కుర్చీలతో దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలిసి పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ఎమ్మెల్యేకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించడంతో గ్రామసభ యథావిధిగా జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Padi Kaushik Reddy
MLA Attacked
Kamalapur
Villagers
Viral Videos

More Telugu News